న్యూఢిల్లీ: సింగపూర్ లిస్టెడ్ కంపెనీ సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీస్ తాజాగా వెక్టర్ గ్రీన్ ఎనర్జీని కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం రూ. 2,780 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది. దీనితో సెంబ్‌కార్ప్ భారత్‌లో పునరుత్పాదక విద్యుత్ విభాగంలో తమ సామర్థ్యాలను 3 గిగావాట్లకు (జీడబ్ల్యూ) పెంచుకోనుంది. భారత్‌లో రెన్యువబుల్స్ పోర్ట్‌ఫోలియోను పెంచుకోవడానికి కట్టుబడి ఉన్నామని సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ వాంగ్ కిమ్ ఇన్ తెలిపారు.
తమ భారత విభాగంలో పవన విద్యుదుత్పత్తికి అనుబంధంగా సౌర విద్యుదుత్పత్తి వాటాను గణనీయంగా పెంచుకునేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని సంస్థ సీఈవో (దక్షిణాసియా) విపుల్ తులి తెలిపారు. వెక్టార్ గ్రీన్‌తో కలిపితే స్థూలంగా సెంబ్‌కార్ప్ రెన్యువబుల్స్ పోర్ట్‌ఫోలియోలో 1 గిగావాట్ సోలార్ అసెట్లు, 2 గిగావాట్ల పవన విద్యుత్ అసెట్లు (ఇప్పటికే ఇన్‌స్టాల్ అయినవి, అభివృద్ధి చేస్తున వాటితో కలిపి) ఉంటాయని ఆయన వివరించారు. 2023 తొలి త్రైమాసికంలో ఈ డీల్ పూర్తి కాగలదని అంచనా. గ్రూప్ స్థాయిలో సెంబ్‌కార్ప్ స్థూల పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యం 8.5 గిగావాట్లకు చేరనుంది. 2025 నాటికల్లా దీన్ని 10 గిగావాట్లకు పెంచుకోవాలని సంస్థ
నిర్దేశించుకుంది.
13 రాష్ట్రాల్లో వెక్టార్ గ్రీన్
గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పార్ట్‌నర్స్ ఇండియా నిర్వహణలోని ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 2 ఆధ్వర్యంలో వెక్టార్ గ్రీన్ ఎనర్జీ స్వతంత్ర విద్యుదుత్పత్తి సంస్థగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం 13 రాష్ట్రాల్లో 519 మెగావాట్ల సామర్థ్యంతో కార్యకలాపాలు ఉన్నాయి. 64 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. అలాగే మరో 1 గిగావాట్ల సామర్థ్యానికి సంబంధించి పెట్టుబడులతో సిద్ధంగా ఉంది. టోరెంట్ పవర్ కూడా వెక్టార్ గ్రీన్ ఎనర్జీ కోసం పోటీపడినప్పటికీ అంతిమంగా సెంబ్‌కార్ప్ దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment