Sembcorp
-
ఏపీ గ్రిడ్‌తో ‘సెంబ్‌కార్ప్’ అనుసంధానం
సాక్షి, అమరావతి: విద్యుత్ వృథాకు అడ్డుకట్ట వేయడంతోపాటు విద్యుత్ ఆదా చేయడం ద్వారా వినియోగదారులపై భారం తగ్గించాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన మేరకు ఏపీ ట్రాన్స్‌కో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సెంబ్‌కార్ప్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి ట్రాన్స్మిషన్ లైన్ నిర్మాణణం చేపట్టింది. 5 కిలోమీటర్ల పొడవున ఈ లైన్ పూర్తికావడంతో మంగళవారం ఏపీట్రాన్స్కో అధికారులు సెంబ్‌కార్ప్ థర్మల్ ప్లాంటు లైన్‌ను పవర్‌గ్రిడ్ లైన్ నుంచి తప్పించి ఏపీగ్రిడ్ లైన్‌కు అనుసంధానం చేశారు. దీంతో పవర్‌గ్రిడ్ ట్రాన్స్మిషన్ లైన్లతో సంబంధం లేకుండా నేరుగా ఏపీట్రాన్స్కో ట్రాన్స్మిషన్ లైన్ల ద్వారా ఏపీ గ్రిడ్‌కు, అక్కడ నుంచి డిస్కంలకు విద్యుత్ సరఫరా అవుతోంది. ఏడాదికి రూ.365 కోట్లు ఆదా విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)లో భాగంగా సెంబ్‌కార్ప్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ (ఎస్ఈఐఎల్)కు చెందిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని థర్మల్ పవర్ ప్లాంటు నుంచి రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటి వరకూ ఈ ప్లాంటు నుంచి పవర్‌గ్రిడ్‌కు చెందిన ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా ఏపీ ఏపీట్రాన్స్కోకు చెందిన రాష్ట్ర గ్రిడ్‌కు, అక్కడి నుంచి డిస్కమ్‌లకు విద్యుత్ సరఫరా అవుతోంది. పవర్‌గ్రిడ్ ట్రాన్స్మిషన్ లైన్ వినియోగించుకున్నందుకు ఆ సంస్థకు యూనిట్‌కు రూ.0.72 పైసలు చొప్పున ఏపీ ట్రాన్స్‌కో చెల్లిస్తోంది. అంటే రోజుకు సగటున రూ.కోటి పవర్‌గ్రిడ్‌కు ట్రాన్స్‌కో ఇవ్వాల్సి వస్తోంది. సెంబ్‌కార్ప్ థర్మల్ పవర్ ప్లాంట్‌తో ఏపీ గ్రిడ్‌ను నేరుగా అనుసంధానం చేయడంవల్ల ఈ ఖర్చు ఆదా కానుంది. రోజుకు 15 మిలియన్ యూనిట్ల చొప్పున ఏడాదికి సుమారు 5,475 మిలియన్ యూనిట్ల విద్యుత్ ‘సెంబ్‌కార్ప్’ నుంచి రాష్ట్ర గ్రిడ్‌కు సరఫరా అవుతోంది. శుభపరిణామం: మంత్రి పెద్దిరెడ్డి తక్కువ సమయంలోనే ఈ లైన్ నిర్మాణం పూర్తిచేసి సెంబ్కార్ప్ను నేరుగా ఏపీ గ్రిడ్‌కు అనుసంధానం చేయడం రాష్ట్రానికి ఎంతో మేలు చేకూర్చే పరిణామమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. -
జపాన్ సంస్థలతో సెంబ్‌కార్ప్ జట్టు
న్యూఢిల్లీ: హరిత విద్యుత్ శక్తి విభాగంలో స్థానం పటిష్టం చేసుకునే దిశగా సింగపూర్‌కి చెందిన సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీస్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భారత్‌లో హరిత అమ్మోనియాను ఉత్పత్తి చేసేందుకు జపాన్‌కు చెందిన రెండు సంస్థలతో చేతులు కలిపింది. దీనికి సంబంధించి సోజిజ్ కార్ప్, క్యుషు ఎలక్ట్రిక్ పవర్‌తో తమ అనుబంధ సంస్థ సెంబ్‌కార్ప్ గ్రీన్ హైడ్రోజన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. ఈ ఒప్పందం ప్రకారం జపాన్‌కు ఎగుమతి చేసే లక్ష్యంతో భారత్‌లో హరిత అమోనియాను ఉత్పత్తి చేసే అవకాశాలను పరిసీలించనున్నట్లు సెంబ్‌కార్ప్ వివరించింది. 2030 నాటికి జపాన్ 3 మిలియన్ టన్నుల అమోనియాను దిగుమతి చేసుకోనుంది. సోజిజ్ సంస్థ ఎనర్జీ ట్రేడింగ్, పెట్టుబడుల వ్యాపార దిగ్గజం కాగా క్యుషు ఎలక్ట్రిక్ ప్రధానంగా జపాన్‌లోని క్యుషు ప్రాంతానికి విద్యుత్ అందిస్తోంది. -
పవన విద్యుత్‌పై సెంబర్‌కార్ప్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: సింగపూర్‌కు చెందిన సెంబర్‌కార్ప్ ఇండస్ట్రీస్ భారత్‌తోపాటు చైనాలో 428 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవన విద్యుత్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకుంది. ఇందుకోసం రూ.1,247 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. సెంబ్‌కార్ప్ భారత్‌లో 18 రాష్ట్రాల్లో కార్యకలాపాలు కలిగి ఉంది. తాజా కొనుగోలుతో సంస్థ నిర్వహణలోని పునరుత్పాదక ఇంధన ఆస్తులు 3.7 గిగావాట్ల సామర్థ్యానికి చేరాయి. ఇందులో 2.25 గిగావాట్ల పవనవిద్యుత్, 1.45 గిగావాట్ల సోలార్ ఆస్తులు ఉన్నాయి. లీప్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన 228 మెగావాట్ల పవన విద్యుత్ ఆస్తులను 70 మిలియన్ సింగపూర్ డాలర్లకు, క్వింజు యూనెంగ్‌కు చెందిన 200 మెగావాట్ల ఆస్తులను 130 సింగపూర్ డాలర్లకు కొనుగోలు చేయనున్నట్టు సెంబర్‌కార్ప్ ఇండస్ట్రీస్ తాజాగా ప్రకటించింది. దీంతో లీప్ గ్రీన్ ఎనర్జీకి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఉన్న 228 మెగావాట్ల పవన విద్యుత్ ఆస్తులు సెంబర్ కార్ప్ సొంతం కానున్నా యి. భారత్‌లో వెక్టార్ గ్రీన్‌కు చెందిన 583 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఆస్తులను సైతం గతే డాది ఈ సంస్థ కొనుగోలు చేయడం గమనార్హం. -
సెంబ్‌కార్ప్ చేతికి వెక్టార్ గ్రీన్ ఎనర్జీ
న్యూఢిల్లీ: సింగపూర్ లిస్టెడ్ కంపెనీ సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీస్ తాజాగా వెక్టర్ గ్రీన్ ఎనర్జీని కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం రూ. 2,780 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది. దీనితో సెంబ్‌కార్ప్ భారత్‌లో పునరుత్పాదక విద్యుత్ విభాగంలో తమ సామర్థ్యాలను 3 గిగావాట్లకు (జీడబ్ల్యూ) పెంచుకోనుంది. భారత్‌లో రెన్యువబుల్స్ పోర్ట్‌ఫోలియోను పెంచుకోవడానికి కట్టుబడి ఉన్నామని సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ వాంగ్ కిమ్ ఇన్ తెలిపారు. తమ భారత విభాగంలో పవన విద్యుదుత్పత్తికి అనుబంధంగా సౌర విద్యుదుత్పత్తి వాటాను గణనీయంగా పెంచుకునేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని సంస్థ సీఈవో (దక్షిణాసియా) విపుల్ తులి తెలిపారు. వెక్టార్ గ్రీన్‌తో కలిపితే స్థూలంగా సెంబ్‌కార్ప్ రెన్యువబుల్స్ పోర్ట్‌ఫోలియోలో 1 గిగావాట్ సోలార్ అసెట్లు, 2 గిగావాట్ల పవన విద్యుత్ అసెట్లు (ఇప్పటికే ఇన్స్టాల్ అయినవి, అభివృద్ధి చేస్తున వాటితో కలిపి) ఉంటాయని ఆయన వివరించారు. 2023 తొలి త్రైమాసికంలో ఈ డీల్ పూర్తి కాగలదని అంచనా. గ్రూప్ స్థాయిలో సెంబ్‌కార్ప్ స్థూల పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యం 8.5 గిగావాట్లకు చేరనుంది. 2025 నాటికల్లా దీన్ని 10 గిగావాట్లకు పెంచుకోవాలని సంస్థ నిర్దేశించుకుంది. 13 రాష్ట్రాల్లో వెక్టార్ గ్రీన్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్స్ ఇండియా నిర్వహణలోని ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 2 ఆధ్వర్యంలో వెక్టార్ గ్రీన్ ఎనర్జీ స్వతంత్ర విద్యుదుత్పత్తి సంస్థగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం 13 రాష్ట్రాల్లో 519 మెగావాట్ల సామర్థ్యంతో కార్యకలాపాలు ఉన్నాయి. 64 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. అలాగే మరో 1 గిగావాట్ల సామర్థ్యానికి సంబంధించి పెట్టుబడులతో సిద్ధంగా ఉంది. టోరెంట్ పవర్ కూడా వెక్టార్ గ్రీన్ ఎనర్జీ కోసం పోటీపడినప్పటికీ అంతిమంగా సెంబ్‌కార్ప్ దక్కించుకుంది. -
భారత్‌లో మరిన్ని పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్‌లో పునరుత్పాదక విద్యుత్ విభాగంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీస్ సీఈవో (దక్షిణాసి యా) విపుల్ తులి తెలిపారు. దేశీయంగా మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు వివరించారు. భారత్‌లో కేవలం తమ థర్మల్ పోర్ట్‌ఫోలియోనే విక్రయిస్తున్నామని, దేశం నుంచి నిష్క్రమించే యోచనేదీ లేదని ఆయన స్పష్టం చేశారు. బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేయబోమంటూ 2020లో చేసిన ప్రకటనకు అనుగుణంగానే థర్మల్ పోర్ట్‌ఫోలియో నుంచి తప్పుకుంటున్నామని పేర్కొన్నారు. ఒమన్‌కి చెందిన తన్వీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సెంబ్‌కార్ప్ ఎనర్జీ ఇండియా (ఎస్ఈఐఎల్)లో పూర్తి వాటాలు విక్ర యించడం వల్ల సంస్థ ఉద్యోగులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని ఆయ న స్పష్టం చేశారు. కొత్త యా జమాన్యం కింద వారు యథాప్రకారం కొనసాగుతా రని తులి వివరించారు. ఈ లావాదేవీ పూర్తయ్యాక తమ సంస్థ పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామ ర్థ్యం 1730 మెగావాట్లుగా ఉంటుందని, 700 మెగావాట్ల ప్రాజెక్టులు అభివృద్ధి దశలో ఉన్నాయని ఆయ న పేర్కొన్నారు. ఈ డీల్‌తో వచ్చే నిధుల్లో కొంత భాగాన్ని పునరుత్పాదక విద్యుత్ పోర్ట్‌ఫోలియోను అభివృద్ధి చేసుకోవడం కోసం వినియోగించనున్న ట్లు వివరించారు. అగ్రగామి పవన విద్యుత్ సంస్థ ల్లో ఒకటిగా ఉన్న తమ కంపెనీ, సౌర విద్యుత్ విభాగంలోనూ శక్తివంతమైన పోర్ట్‌ఫోలియోను నిర్మించు కునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తులి చెప్పారు. అలాగే విద్యుత్ స్టోరేజీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి విభాగాల్లో నూ అవకాశాలు పరిశీలిస్తున్నామన్నారు. -
భవిష్యత్తు ‘వెలుగు’లకు భరోసా
సాక్షి, అమరావతి: సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీస్‌కు చెందిన సెంబ్‌కార్ప్ ఎనర్జీ ఇండియాతో రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని (పీపీఏ) కుదుర్చుకున్నాయి. 12 ఏళ్ల పాటు డిస్కంలకు ఈ సంస్థ 625 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేయనుంది. వచ్చే ఏడాది (2023) నుంచి ఈ ఒప్పందం అమల్లోకి రానుంది. రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ వనరుల నుంచి 8,075 మెగావాట్లు వస్తోంది. కానీ వీటి నుంచి విద్యుత్ ఉత్పత్తి వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. దీంతో ఏడాదిలో ఎక్కువ రోజులు పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరగటం లేదు. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కెపాసిటీ 5,010 మెగావాట్లుగా ఉంది. ఈ థర్మల్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గును సమకూర్చేందుకు మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, సింగరేణి సంస్థలతోపాటు విదేశాల నుంచి దిగుమతులే ఆధారం. ఇలా సమకూర్చుకున్న బొగ్గు మన థర్మల్ ప్లాంట్ల మొత్తం అవసరాలలో 70 నుంచి 75 శాతం తీర్చగలుగుతాయి. జెన్కో బొగ్గు ప్లాంట్లకి రోజుకు దాదాపు 70 వేల టన్నుల బొగ్గు అవసరం. గతేడాది దేశంలో బొగ్గు సంక్షోభం తీవ్రంగా వేధించింది. గత ఏడాది సెప్టెంబర్ ఆఖరులో రోజుకు 24 వేల టన్నుల బొగ్గు మాత్రమే అందుబాటులో ఉందంటే ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్ అవసరాల కోసం బొగ్గు కొరత సమయంలో రాష్ట్రంలో థర్మల్ ప్లాంట్లు నడపడం దాదాపు అసాధ్యమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో బహిరంగ మార్కెట్ నుంచి అధిక ధరలు చెల్లించైనా సరే విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యుత్ సంస్థలకు సూచించారు. అప్పుడు మార్కెట్లో యూనిట్‌కు రూ.20 వెచ్చించి విద్యుత్ కొన్నారు. సాధారణ రోజుల్లో ఈ రేటు రూ.6 వరకు ఉంటుంది. మళ్లీ ఇలాంటి పరిస్థితి రాదని చెప్పలేం. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను, రాబోయే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సెంబ్‌కార్ప్‌తో ఒప్పందం చేసుకున్నారు. యూనిట్ ధర రూ.3.84 నెల్లూరులో సెంబ్‌కార్ప్ ఎనర్జీకి 2.6 గిగావాట్ల సూపర్ క్రిటికల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉంది. ఈ థర్మల్ ప్లాంట్ సామర్థ్యంలో 77 శాతం విద్యుత్‌ను దీర్ఘకాలిక, మధ్యకాలిక పీపీఏల ద్వారా డిస్కంలకు ఇస్తోంది. మనకు యూనిట్ రూ.3.84కు ఇవ్వనుంది. – నాగులపల్లి శ్రీకాంత్, ఇంధనశాఖ కార్యదర్శి ఏపీఅభివృద్ధిలో భాగమవుతున్నందుకు సంతోషం పునరుత్పాదక శక్తిలో సెంబ్‌కార్ప్ తన ఉనికిని వేగంగా పెంచుకుంటోంది. మేం ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను సరైన రీతిలో ఉపయోగించుకోవడానికి ఏపీ డిస్కంలతో జరిగిన దీర్ఘకాలిక ఒప్పందం దోహదపడుతుందని భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మా భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నందుకు సంతోషంగా ఉంది. – విపుల్ తులి, సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీస్ దక్షిణాసియా విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ -
ఎన్సీసీకి హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: సెంబ్ కార్ప్ గాయత్రి పవర్ లిమిటెడ్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం సకాలంలో పనులు చేయలేకపోయిన ఎన్సీసీకి హైకోర్టులో చుక్కెదురైంది. సకాలంలో పనులు చేస్తామని ఇచ్చిన బ్యాంకు గ్యారెంటీలను నగదుగా మార్చుకునేందుకు గాయత్రి సంస్థ చేసిన ప్రయత్నాలను ఎన్సీసీ సవాల్ చేయటం తెలిసిందే. ఈ మేరకు ఎన్సీసీ చేసిన అప్పీలు పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టివేసింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని ప్రకటించింది. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ టి.రజనితో కూడిన ధర్మాసనం రెండు రోజుల క్రితం తీర్పును వెలువరించింది. 2,660 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్ధేశించిన పనుల్ని చేసేందుకు ఎన్సీసీ, గాయత్రి పవర్ మధ్య డీల్ కుదురింది. ఇందుకు రూ.8.5 కోట్లు, రూ.4.25 కోట్ల చొప్పున రెండు బ్యాంక్ గ్యారెంటీలను ఎన్సీసీ ఇచ్చింది. ఒప్పందం ప్రకారం ఎన్సీసీ సకాలంలో పనులు చేయలేదని గాయత్రి ఆ గ్యారెంటీలను క్యాష్ చేసుకోవాలని నిర్ణయించింది. దీనిని ఎన్సీసీ హైదరాబాద్‌లోని కింది కోర్టులో సవాల్ చేస్తే ప్రతికూల ఫలితం వచ్చింది. దాంతో ఎన్సీసీ హైకోర్టులో అప్పీల్ చేసింది. విచారించిన ధర్మాసనం.. ఎన్సీసీ బేషరతు గ్యారెంటీ ఇచ్చిందని, పైగా గాయత్రి ఒప్పం దాన్ని ఉల్లంఘించినట్లుగా నిరూపించలేకపోయిం దని తెలిపింది. ఈ పరిస్థితుల్లో గ్యారెంటీలను ఎన్‌క్యాష్ చేసుకునేందుకు గాయత్రికి హక్కు ఉందని స్పష్టం చేసింది. దీనిపై ఎన్సీసీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటామని కోరగా... ఆ వినతిని పరిగణనలోకి తీసుకుని రెండు వారాలపాటు గ్యారెంటీలను ఎన్‌క్యాష్ చేసుకోవద్దని గాయత్రికి తన తీర్పులో సూచించింది. -
ఎన్సీసీ-సెంబ్‌కార్ప్ డీల్‌కు బొగ్గే అడ్డంకి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎన్సీసీ పవర్ ప్రాజెక్ట్స్‌లో సింగపూర్‌కి చెందిన సెంబ్‌కార్ప్ వాటా కొనుగోలుకు బొగ్గు సరఫరా ఒప్పందం ప్రధాన అడ్డంకిగా తయారయ్యింది. ఈ థర్మల్ ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గు సరఫరా చేయడానికి ప్రభుత్వం ఎన్‌సీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు ఈ వాటాను సెంబ్‌కార్ప్ కొంటే బొగ్గు సరఫరాకు సంబంధించి న్యాయపరంగా చిక్కులు వచ్చే అవకాశం ఉండటంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆలస్యం జరుగుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారి ఒకరు చెప్పారు. దీనిపై శుక్రవారం ఇరు కంపెనీల ప్రతినిధులు సమావేశం అవుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టులో టి.సుబ్బిరామిరెడ్డికి చెందిన గాయత్రీ గ్రూపునకు 45 శాతం వాటా ఉండటంతో బొగ్గు సరఫరా అనేది ఒప్పందానికి పెద్ద అడ్డంకి కాబోదని ఎన్సీసీ యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ న్యాయపరమైన సమస్యను సులభంగా పరిష్కరించుకోగలమన్న ధీమా ఎన్సీసీలో కనిపిస్తోంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 1,320 మెగావాట్ల సామర్థ్యంతో ఎన్సీసీ, గాయత్రీ గ్రూపులు సంయుక్తంగా ఎన్సీసీ పవర్ పేరుతో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో 55 శాతం వాటా ఉన్న ఎన్సీసీ ఇప్పటి వరకు రూ.460 కోట్లు వ్యయం చేయగా, ఇంతే మొత్తం చెల్లించడం ద్వారా ఈ వాటాను కొనుగోలు చేయడానికి సెంబ్‌కార్ప్ ముందుకొచ్చినట్లు సమాచారం. 2015కి అందుబాటులోకి వచ్చే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అవసరమైన పెట్టుబడులను సెంబ్‌కార్ప్ సమకూరుస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రెండు మూడు రోజుల్లో ఈ ఒప్పందానికి గురించి తుది నిర్ణయం తీసుకుంటారని, జనవరి రెండో వారంలో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
సెంబ్‌కార్ప్‌కు ఎన్సీసీ పవర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఎన్సీసీ పవర్ ప్రాజెక్టులో మెజారిటీ వాటాను సింగపూర్‌కు చెందిన సెంబ్‌కార్ప్ దక్కించుకుంటోంది. దీన్లో ఎన్సీసీకి చెందిన 55% వాటాను రూ.460 కోట్లకు సెంబ్‌కార్ప్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 1,320 మెగావాట్ల ఈ విద్యుత్ ప్రాజెక్టులో 55% వాటా నాగార్జున కన్స్ట్రక్షన్స్కు చెందిన ఎన్సీసీ చేతిలో ఉండగా... మిగిలిన 45% ఎంపీ టి.సుబ్బరామిరెడ్డికి చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్ చేతిలో ఉంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ముత్తుకూరు వద్ద నిర్మిస్తున్న ఈ విద్యుత్తు ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటిదాకా 35% పనులు పూర్తయ్యాయని, ప్రాజెక్టుకు మొత్తం రూ.1,800 కోట్ల రుణభారం ఉందని ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న కంపెనీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి చెప్పారు. ఈ డీల్‌కు సంబంధించిన ప్రాథమిక అవగాహనపై ఇరు సంస్థలూ బుధవారం సంతకాలు చేశాయని, మిగతా వ్యవహారాలన్నీ అనుకున్నట్లు పూర్తయితే డిసెంబర్ నెలాఖరులోగా అధికారిక ప్రకటన వెలువడుతుందని ఆయన చెప్పారు. ఒకవైపు వ్యయం పెరిగిపోవటం, రూపాయి క్షీణించటం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎన్సీసీ ఇన్వెస్ట్ చేసిన రూ.460 కోట్లను తిరిగి చెల్లించటం ద్వారా దాని వాటాను సొంతం చేసుకోవటానికి సెంబ్‌కార్ప్ ముందుకొచ్చిందని, ముఖ్యంగా రుణభారం తగ్గుతుంది కనుక వాటా విక్రయానికి ఎన్సీసీ మొగ్గు చూపిందని తెలియవచ్చింది. ఈ ఒప్పందానికి అమర్‌చంద్ అండ్ మంగళదాస్ న్యాయ సేవలు అందిస్తుండగా, కేపీఎంజీ ఫైనాన్షియల్ అడ్వైజరీ సేవలను అందిస్తోంది. రూ.7,047 కోట్ల పెట్టుబడి అంచనాతో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టులో ఎన్సీసీ తన వాటా కింద రూ.960 కోట్లు సమకూర్చాల్సి ఉండగా ఇంతవరకు రూ.460 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ప్రాజెక్టుకు రూ.1,800 కోట్ల రుణభారం ఉంది. ఎన్సీసీ తన వాటాను విక్రయించటంతో రూ.990 కోట్ల మేర రుణం కూడా సెంబ్‌కార్ప్‌కు బదిలీ అవుతుంది. ప్రాజెక్టులో యాజమాన్య హక్కు కోల్పోయినప్పటికీ దీనికి సంబంధించిన ఈపీసీ కాంట్రాక్టులను ఎన్‌సీసీనే నిర్వహిస్తుంది. ఇది 2015 నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా. ప్రాజెక్టుకు సంబంధించి ఇంతవరకూ బొగ్గు సరఫరా, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరగలేదు. దీని పక్కనే గాయత్రితో కలిసి సెంబ్‌కార్ప్ మరో విద్యుత్ ప్రాజెక్టును కలిగి ఉండటంతో ఈ ఒప్పందం సెంబ్‌కార్ప్‌కు లాభం చేకూరుస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.