ఎన్‌సీసీ-సెంబ్‌కార్ప్ డీల్‌కు బొగ్గే అడ్డంకి | Sembcorp, Genting eye NCC's power plant | Sakshi
Sakshi News home page

ఎన్‌సీసీ-సెంబ్‌కార్ప్ డీల్‌కు బొగ్గే అడ్డంకి

Published Fri, Jan 3 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM

ఎన్‌సీసీ-సెంబ్‌కార్ప్ డీల్‌కు బొగ్గే అడ్డంకి

ఎన్‌సీసీ-సెంబ్‌కార్ప్ డీల్‌కు బొగ్గే అడ్డంకి

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎన్‌సీసీ పవర్ ప్రాజెక్ట్స్‌లో సింగపూర్‌కి చెందిన సెంబ్‌కార్ప్ వాటా కొనుగోలుకు బొగ్గు సరఫరా ఒప్పందం ప్రధాన అడ్డంకిగా తయారయ్యింది. ఈ థర్మల్ ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గు సరఫరా చేయడానికి ప్రభుత్వం ఎన్‌సీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు ఈ వాటాను సెంబ్‌కార్ప్ కొంటే బొగ్గు సరఫరాకు సంబంధించి న్యాయపరంగా చిక్కులు వచ్చే అవకాశం ఉండటంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆలస్యం జరుగుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారి ఒకరు చెప్పారు. దీనిపై శుక్రవారం ఇరు కంపెనీల ప్రతినిధులు సమావేశం అవుతున్నట్లు ఆయన తెలిపారు.
 
 ఈ ప్రాజెక్టులో టి.సుబ్బిరామిరెడ్డికి చెందిన గాయత్రీ గ్రూపునకు 45 శాతం వాటా ఉండటంతో బొగ్గు సరఫరా అనేది ఒప్పందానికి పెద్ద అడ్డంకి కాబోదని ఎన్‌సీసీ యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ న్యాయపరమైన సమస్యను సులభంగా పరిష్కరించుకోగలమన్న ధీమా ఎన్‌సీసీలో కనిపిస్తోంది.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 1,320 మెగావాట్ల సామర్థ్యంతో ఎన్‌సీసీ, గాయత్రీ గ్రూపులు సంయుక్తంగా ఎన్‌సీసీ పవర్ పేరుతో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో 55 శాతం వాటా ఉన్న ఎన్‌సీసీ ఇప్పటి వరకు రూ.460 కోట్లు వ్యయం చేయగా, ఇంతే మొత్తం చెల్లించడం ద్వారా ఈ వాటాను కొనుగోలు చేయడానికి సెంబ్‌కార్ప్ ముందుకొచ్చినట్లు సమాచారం. 2015కి అందుబాటులోకి వచ్చే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అవసరమైన పెట్టుబడులను సెంబ్‌కార్ప్ సమకూరుస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రెండు మూడు రోజుల్లో ఈ ఒప్పందానికి గురించి తుది నిర్ణయం తీసుకుంటారని, జనవరి రెండో వారంలో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement