సాక్షి, హైదరాబాద్: సెంబ్ కార్ప్ గాయత్రి పవర్ లిమిటెడ్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం సకాలంలో పనులు చేయలేకపోయిన ఎన్‌సీసీకి హైకోర్టులో చుక్కెదురైంది. సకాలంలో పనులు చేస్తామని ఇచ్చిన బ్యాంకు గ్యారెంటీలను నగదుగా మార్చుకునేందుకు గాయత్రి సంస్థ చేసిన ప్రయత్నాలను ఎన్‌సీసీ సవాల్ చేయటం తెలిసిందే. ఈ మేరకు ఎన్‌సీసీ చేసిన అప్పీలు పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టివేసింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని ప్రకటించింది.
ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ టి.రజనితో కూడిన ధర్మాసనం రెండు రోజుల క్రితం తీర్పును వెలువరించింది. 2,660 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్ధేశించిన పనుల్ని చేసేందుకు ఎన్‌సీసీ, గాయత్రి పవర్ మధ్య డీల్ కుదురింది. ఇందుకు రూ.8.5 కోట్లు, రూ.4.25 కోట్ల చొప్పున రెండు బ్యాంక్ గ్యారెంటీలను ఎన్‌సీసీ ఇచ్చింది.
ఒప్పందం ప్రకారం ఎన్‌సీసీ సకాలంలో పనులు చేయలేదని గాయత్రి ఆ గ్యారెంటీలను క్యాష్ చేసుకోవాలని నిర్ణయించింది. దీనిని ఎన్‌సీసీ హైదరాబాద్‌లోని కింది కోర్టులో సవాల్ చేస్తే ప్రతికూల ఫలితం వచ్చింది. దాంతో ఎన్‌సీసీ హైకోర్టులో అప్పీల్ చేసింది. విచారించిన ధర్మాసనం.. ఎన్‌సీసీ బేషరతు గ్యారెంటీ ఇచ్చిందని, పైగా గాయత్రి ఒప్పం దాన్ని ఉల్లంఘించినట్లుగా నిరూపించలేకపోయిం దని తెలిపింది.
ఈ పరిస్థితుల్లో గ్యారెంటీలను ఎన్‌క్యాష్ చేసుకునేందుకు గాయత్రికి హక్కు ఉందని స్పష్టం చేసింది. దీనిపై ఎన్‌సీసీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటామని కోరగా... ఆ వినతిని పరిగణనలోకి తీసుకుని రెండు వారాలపాటు గ్యారెంటీలను ఎన్‌క్యాష్ చేసుకోవద్దని గాయత్రికి తన తీర్పులో సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment