ఆటాడుకుందామా...!
భద్రాచలం : క్రీడారంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో అధునాతన స్టేడియాల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించింది. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే పినపాక నియోజకవర్గంలో స్టేడియం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భద్రాచలం, మధిర, ఇల్లెందు, పాల్వంచ నియోజకవర్గ కేంద్రాల్లో స్టేడియాల నిర్మాణానికి అవసర మైన భూమిని గుర్తించిన అధికారులు.. ఈ నెలాఖరు నాటికి పనులకు టెండర్లు పిలిచేం దుకు రంగం సిద్ధం చేశారు. జిల్లాలో ఇప్పటికే కొన్ని చోట్ల స్టేడియాలు ఉన్నప్పటికీ, వాటిలో క్రీడాకారులకు తగిన సౌకర్యాలు లేవు.
అందుబాటులో ఉన్న గ్రౌండ్ల్లోనూ వసతులు లేక కొన్ని ఆటలకే పరిమితం చేయాల్సి వస్తోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల్లోని ప్రతిభను, ఆసక్తిని వెలికితీసే అవకాశం రావడం లేదు. ఈ నే పథ్యంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారులు చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ప్రతి నియోజకవర్గంలో ఐదెకరాల స్థలంలో అధునాతన హంగులతో స్డేడియాల నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించింది. ‘గ్రీన్ ఫీల్డ్ స్డేడియాస్’ అనే ప్రత్యేక ప్రాజెక్టులో భాగంగా ఒక్కో స్టేడియానికి రూ.2.50 కోట్లు మంజూరు చేసింది.
ఇప్పటికే ఈ నిధులు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఖాతాలో జమ కావడంతో త్వరతగతిన పనులు పూర్తి చేసేందుకు సదరు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అందరికీ అందుబాటులో ఉండేలా నియోజకవర్గ కేంద్రాల్లోనూ వీటిని నిర్మించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఐదెకరాల స్థల సేకరణ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లటంతో ఆయన ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే భద్రాచలం, మధిర, ఇల్లెందు, పాల్వంచలో భూమిని గుర్తించారు. మిగతా చోట్ల కూడా సాధ్యమైనంత త్వరగా భూమిని అప్పగించేందుకు రెవెన్యూ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఆటలన్నీ ఒకే ప్రాంగణంలో...
గ్రీన్ ఫీల్డ్ స్డేడియాస్ ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న స్టేడియంలో అన్ని రకాల ఆటలకు అనువుగా ఉండేలా రూపకల్పన చేశారు. ఇండోర్ స్టేడియంతో పాటు, టేబుల్ టె న్నిస్, మినీ స్విమ్మింగ్ పూల్, షటిల్, టేబుల్ టెన్నిస్, జిమ్నాస్టిక్, క్రికెట్ వంటి క్రీడలు ఆడుకునేందుకు తగిన సౌకర్యాలు కల్పించనున్నారు. అంతేకాకుండా ఇదే ప్రాంగణంలో స్టేడియం నిర్వహణ చూసుకునేందుకు అనువుగా కార్యాలయ భవనాన్ని కూడా నిర్మించనున్నారు. భద్రాచలం వంటి ప్రాంతంలో అధునాతన స్టేడియం నిర్మాణం ద్వారా గిరిజన క్రీడాకారులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. వివిధ క్రీడల్లో ఆసక్తి ఉన్న వారిని ప్రోత్సహించేందుకు, వాటిలో క్రీడాకారులకు తర్ఫీదు ఇచ్చేందుకు ఈ క్రీడా మైదానాలు ఉపకరిస్తాయని పలువురు అంటున్నారు.
సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తాం : కబీర్ దాస్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి
క్రీడా మైదానాల నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాము. ఇందుకు అవసరమైన స్థలాలను కేటాయించే విషయంలో రెవెన్యూ అధికారుల సహకారం బాగుంది. నాలుగు చోట్ల స్థలం గుర్తించినందున ఈ నెలాఖరు నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా రంగానికి సంబంధించి భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని స్టేడియంలలో తగిన ఏర్పాట్లు చేస్తున్నాము.