‘కూచిపూడి’కి మహర్దశ !
నాట్య అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం
ఎమ్మెల్యే కల్పన సూచనలకు సీఎం సానుకూలం
కూచిపూడి : దేశవిదేశాల్లో గుర్తింపు పొందిన కూచిపూడి నృత్యానికి, గ్రామానికి త్వరలోనే మరింత ప్రాచుర్యం లభించనుంది. విఖ్యాత నాట్యక్షేత్రమైన కూచిపూడి గ్రామ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన ఇటీవల పలు ప్రతిపాదనలు చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు కూచిపూడి గ్రామంలో నాట్య అకాడమీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ అకాడమీని తెలుగు విశ్వవిద్యాలయం అధీనంలో ఉన్న శ్రీ సిద్ధేంద్రయోగి నాట్య కళాపీఠంలో ఏర్పాటు చేయాలని కొందరు కోరుతున్నారు.
పసుమర్తి వారిధర్మచెరువులో గ్రామం పంచాయతీ కేటాయించిన ఎకరం పైగా ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేయాలని మరికొందరు సూచిస్తున్నారు. అకాడమీ ఏర్పాటు చేస్తే కూచిపూడి నృత్యానికి, తమ గ్రామానికి మహర్దశ పడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఎందరో ఉద్దండుల కృషి వల్ల విశ్వవ్యాపితం..
కూచిపూడి నృత్యం సనాత భారతీయ సంస్కృతికి దర్పణంగా నిలుస్తుంది. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, సంప్రదాయాలను ప్రతిబింబింపజేస్తుంది. ఇంతటి ఘనతను పొందిన ఈ నృత్యం... ప్రఖ్యాత నాట్యాచార్యులు పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం, పద్మశ్రీ డాక్టర్ వేదాంతం సత్యనారాయణశర్మ, భరత కళాప్రపూర్ణ చింతా కృష్ణమూర్తి, భరత కళాప్రపూర్ణ వేదాంతం రాఘవయ్య, కులపతి భాగవతుల రామకోటయ్య, కులపతి పీవీజీ కృష్ణశర్మ వంటి ఉద్దండుల కృషి, అంకితభావం కారణంగా విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ నాట్యాన్ని ఒకే రీతిలో పుట్టినింట నేర్చుకోవడానికి ప్రభుత్వం నిబంధనలు విధిస్తే కళాకారులకు, గురువులకు మరింత శోభ లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. విదేశీయులు, పొరుగు రాష్ట్రాల కళాకారులు, అభిమానులు తరలివచ్చి శ్రీ సిద్ధేంద్రుడు నడయాడిన ఈ గ్రామాన్ని సందర్శించే అవకాశముందని చెబుతున్నారు.
నిరుపయోగంగా పర్యాటక శాఖ భవనం
శ్రీ సిద్ధేంద్రయోగి నాట్య కళాపీఠం భవనం పై అంతస్తులో సుమారు రూ.50లక్షలతో నిర్మించిన పర్యాటక శాఖ భవనం నిరుపయోగంగా మారింది. ఆ భవనంలో నృత్య అకాడమీ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.
25న పర్యాటక శాఖ కార్యక్రమాలు?
పర్యాటక రంగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా పర్యాటక శాఖ అధికారిణి, విజయవాడ సబ్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఈ నెల 25న కూచిపూడి గ్రామంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో కూచిపూడి నాట్య ప్రదర్శనల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో కూచిపూడిలో నాట్య అకాడమీ ఏర్పాటుపై జిల్లా పర్యాటక అధికారిణి దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.