అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా
* విజిలెన్స్ అధికారులకు
* అదనపు డీజీ ఆదేశాలు
గుంటూరు క్రైం: ప్రభుత్వ ఆదాయాన్ని పెంపొందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు డీజీ టీపీ దాసు ఆదేశించారు. జిల్లాల పర్యటనలో భాగంగా గురువారం ఆయన గుంటూరులోని రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా అధికారులతో సమావేశమయ్యారు. అక్రమంగా తరలించే ఇసుక, రేషన్ బియ్యం తదితర వస్తువులపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని ఆదేశించారు. అక్రమ రవాణా కొనసాగే ప్రాంతాలతో పాటు, జతీయ రహదారిపై, ప్రధాన మార్గాల్లో తరచూ తనిఖీలు నిర్వహించాలని చెప్పారు.
ప్రభుత్వం నుంచి వచ్చే నివేదికల ఆదారంగా దర్యాప్తు జరిపి వాటిని వెంటనే పంపించేలా, పెండింగ్‌లో వున్న దర్యాప్తులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను కచ్చితంగా చేరుకునేలా ప్రణాళికలు రూపొందించుకొని జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలని ఆకాక్షించారు. విధి నిర్వహణలో సిబ్బందికి ఎలాంటి సమస్యలు వున్నా వాటిని పరిష్కరించాలని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని జిల్లాలో ఏర్పడుతున్న నేపథ్యంలో సిబ్బంది సంఖ్య పెంపు, కార్యాలయాల ఏర్పాటు తదితర అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.
అనంతరం అదనపు డీజీ రికార్డులను పరిశీలించారు. సమావేశంలో విజిలెన్స్ ఎస్పీ కేవీ మోహన్‌రావు, డీఎస్పీ, సీఐలు వంశీధర్, కిషోర్‌బాబు, ఏవో కె.వెంకట్రావు, ఎంపీడీఓ శ్లీవారెడ్డి, సూపరింటెండెంట్ రాంగోపాల్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. తొలుత విజిలెన్స్ ఎస్పీ మోహన్‌రావు అడిషనల్ డీజీ టీపీదాసుకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన అధికారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.