పనిచేస్తున్న చోటే చేతివాటం చూపిన గుమస్తా
జమ్మికుంట (కరీంనగర్) : ఉద్యోగం చేస్తున్న చోటే చేతివాటం చూపి అడ్డంగా దొరికిపోయాడు ఓ ప్రబుద్ధుడు. కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే...జమ్మికుంటలోని ధనలక్ష్మి జ్యుయెలర్స్లో కటుకోజు సురేశ్ గుమస్తాగా కుదిరాడు. ఆరు నెలలుగా నమ్మకంగా పనిచేస్తూ యజమాని కందుకూరి వెంకటేశ్వర్లు నమ్మకాన్ని చూరగొన్నాడు. అయితే గత కొన్ని రోజులుగా దుకాణంలోని చిన్ని చిన్న ఆభరణాలు మాయమవుతున్నాయి. యజమాని వెంకటేశ్వర్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం కనిపించలేదు.
దీంతో ఆయన ఈ నెల 10వ తేదీన జమ్మికుంట పోలీసులు ఫిర్యాదు చేశాడు. పోలీసు విచారణలో నిందితుడు సురేశ్ అని తేలింది. అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దుకాణం నుంచి 10 తులాల చెవి కమ్మలతోపాటు రెండు కిలోల వెండిని తస్కరించినట్లు అతడు ఒప్పుకున్నాడు. సోదరుడు రవీందర్ సాయంతో వాటిని విక్రయించినట్లు వెల్లడించాడు. దీంతో దొంగసొత్తుతోపాటు సురేశ్, రవీందర్ సహా కొనుగోలు చేసిన నలుగురిని శనివారం పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు పంపారు.