సమ్మక్క–సారలమ్మ జిల్లా ఏర్పాటు చేయాలి
కలెక్టరేట్ ఎదుట ఆదివాసీ సంఘాల ధర్నా
హన్మకొండ అర్బన్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా ఐదో షెడ్యూల్లోని భూభాగాన్ని విడదీయకుండా ములుగు కేంద్రంగా సమ్మక్క–సారలమ్మ జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదివాసీ సంఘాలు, కాంగ్రెస్, ప్రజాసంఘాలు, న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఐదో షెడ్యూల్ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం విభజన ప్రక్రియ చేపట్టిందన్నారు. ప్రస్తుతం జిల్లాలోని 13 గిరిజన మండలాలు సబ్‌ప్లాన్ పరిధిలో ఉన్నాయని గుర్తు చేశారు. ఐదో షెడ్యూల్ భూభాగం ముక్కలు చేసి ఒక్కో జిల్లాకు చేర్చడం వల్ల రానున్న రోజుల్లో పీసాచట్టం, 1/70 చట్టం వర్తింపకుండా చేసే కుట్ర జరగుతోందన్నారు. దీనివల్ల వెనుకబడ్డ ఆదివాసీ జాతులు ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అశాస్త్రీయంగా చేస్తున్న విభజన ఆపాలని, ఆదివాసీల ప్రాంతం మొత్తం ఉండేలా సమ్మక్క–సారలమ్మ జిల్లా ఏర్పాటు చేయాలని కోరారు. ఆందోళన అనంతరం డీఆర్వో శోభకు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ నాయకులు బొల్లు దేవేందర్, పొదెం కృష్ణప్రసాద్, పిన్నింటి యాదిరెడ్డి, పాక సాంబయ్య, మండల వెంకన్న, కొమురం ప్రభాకర్, కబ్బాక శ్రావణ్, చిన్న వెంకటయ్య, రత్నం, అర్రెం నారాయణ, అశోక్, సమ్మక్క, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర నాయకులు ఉన్నారు.