వంటచేసి ఇస్తే.. వర్షం కురిపిస్తున్నాడుట!
అహ్మదాబాద్: నగరంలోని మెహందీ కువా ప్రాంతంలోని ఓ చిన్న మసీదుకు ఇప్పుడు భక్తులు క్యూ కడుతున్నారు. మసీదులో నివాసం ఉంటున్న డోకల్ బాబాకు డొక్లా(ప్రముఖ గుజరాతీ వంటకం)ను సమర్పిస్తే ఆయన వర్షాలు కురిపిస్తాడని చెప్తున్నారు. బాబా కోసం ప్రత్యేకంగా తయారుచేసిన డొక్లా వంటకంతో ఆయన్ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతుండటంతో మసీదు చుట్టుపక్కల దుకాణాలు వెలిశాయి. 400 ఏళ్ల క్రితం అహ్మదాబాద్ నగరానికి పునాది రాళ్లు వేసిన 12 మంది సన్యాసుల్లో డొక్లా కూడా ఒకరని, ఈయన ఢిల్లీకి చెందిన క్వాజా నిజాముద్దీన్ అలియా శిష్యుల్లో ఒకరని చరిత్రకారులు చెప్తున్నారు.
గత ఏడాది వర్షాలు లేకపోవడంతో నగరప్రజలు మసీదులోని డొకల్ బాబాకు పూజలు చేసి, ఆయనకు ఇష్టమైన డొక్లా వంటకాన్ని నైవేద్యంగా ఇచ్చి వర్షాలు కురవాలని ప్రార్ధనలు చేశారు. సంతోషించిన బాబా వర్షాలు కురవాలని చెప్పడంతో సీజన్ కు అవసరమైనన్ని వర్షాలు కురిశాయని భక్తులు చెబుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ బుతుపవనాలు నగరాన్ని తాకక పోవడంతో డొక్లా వంటకంతో ప్రజలందరూ మసీదు బాట పట్టారు. వర్షాలు కురిపించాలంటూ ప్రార్ధనలు చేస్తున్నారు.
అలీ అనే భక్తుడు మాట్లాడుతూ.. వర్షాల కోసం ఈ ఏడాది బాబాను ప్రార్ధించామని త్వరలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. వర్షాలు లేకపోతే ఎక్కువగా ఇబ్బందులు పడేది పేద ప్రజలేనని అందుకే వర్షాలు కురవాలని వారందరూ బాబాను వేడుకుంటున్నారని తెలిపారు. డొక్లా వంటకానికి బాబాకు ఉన్న సంబంధం ఏంటో? తనకు తెలియదని, కానీ ఆ వంటకం చేసి బాబాకు నివేదిస్తే వర్షాలు కురుస్తాయని అన్నారు. కేవలం ముస్లింలే కాకుండా హిందూవులు కూడా బాబాకు పూజలు చేస్తున్నట్లు చెప్పారు.