పాలకా..చూడిక
డోన్: ఐదేళ్ల క్రితం డోన్ మునిసిపాలిటీగా ఏర్పడ్డా నేటికి మునిసిపల్ కార్యాలయం పాతభవనంలోనే కొనసాగుతోంది. కొత్త భవన నిర్మాణానికి నిధులు మంజూరైన ఫలితం లేదు. చివరకు నిధులు వెనక్కి మళ్లే అవకాశాలు లేకపోలేదని కార్యాలయ సిబ్బందే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని పాతపేటలో ఉన్న ప్రస్తుత మునిసిపల్ కార్యాలయంలో సిబ్బందికి కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఇక మునిసిపల్ కమిషనర్, చైర్మన్లకు కేటాయించిన గదులు చాలా ఇరుకుగా ఉన్నాయి. టీపీఓ, మేనేజర్, శానిటరీ ఇన్స్పెక్టర్, ఇంజనీరింగ్ సిబ్బందికి సరైన గదులు లేక ఉన్న వాటిలోనే కాలం వెళ్లదీస్తున్నారు.
ఇంకా స్థలసేకరణే: మునిసిపల్ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి ఐదేళ్ల కిత్రం రూ.కోటిరూపాయల నిధులు విడుదలయ్యాయి. మొదట ప్రస్తుతం ఉన్న పాతభవనాన్ని పడగొట్టి అక్కడే కొత్త భవనం నిర్మించాలని భావించినా, పట్టణంలో నూతనంగా ఫ్లైఓవర్ బిడ్జి నిర్మాణం ఏర్పాటుకానున్నందున పాతభవనం స్థానంలో కొత్త బిల్డింగ్ ఏర్పాటు ఇబ్బందిగా ఉంటుందని భావించి పట్టణ సమీపంలో స్థలసేకరణ జరుపుతున్నారు.
అయితే స్థానిక గ్రూపు రాజకీయాల కారణంగా స్థలసేకరణలో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. మునిసిపాలిటీ కార్యాలయానికి స్థలాన్ని రెవెన్యూ అధికారులు చూపుతున్నా స్థానిక నేతలు పట్టించుకోకపోవడంతో నేటికి స్థలసేకరణలోనే ఉందని అంటున్నారు. నూతన భవన నిర్మాణం పూర్తయితే కార్యాలయసిబ్బందికి, అటు ప్రజలకు అనువుగా ఉంటుంది. కొత్తగా ఎన్నికైన పాలకవర్గమైనా మునిసిపల్ కార్యాలయానికి శ్రీకారం చుడితే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు.