ఆ డబ్బు మాల్యాని విత్ డ్రా చేసుకోనివ్వండి.. !
75 మి. డాలర్ల డీల్‌పై డియాజియో హోల్డింగ్స్ నెథర్లాండ్స్ పిటిషన్
బెంగళూరు: యునెటైడ్ స్పిరిట్స్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవడానికి సంబంధించి విజయ్‌మాల్యాతో కుదుర్చుకున్న ఒప్పందం అమలు జరిగేలా చూడాలని డియాజియో హోల్డింగ్స్ నెథర్లాండ్స్ బెంగళూరు డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ)ని ఆశ్రయించింది. ఈ దిశలో ఒప్పందం మేరకు 75 మిలియన్ డాలర్లను (దాదాపు రూ.500 కోట్లు) మాల్యా ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని కోరింది. ఇప్పటికే బ్రిటిష్ లిక్కర్ దిగ్గజం డియాజియో కూడా ఈ మేరకు ఒక పిటిషన్ దాఖలు చేసింది.
కేసు తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. మాల్యా యూబీ గ్రూప్ కంపెనీ అయిన యునెటైడ్ స్పిరిట్స్‌లో మెజారిటీ వాటాను డియాజియో 2012లో చేజిక్కించుకుంది. అయితే, యునెటైడ్ స్పిరిట్స్ చైర్మన్ పదవితోపాటు కంపెనీ డెరైక్టర్ల బోర్డు నుంచి పూర్తిగా వైదొలగే షరతుపై మాల్యా 75 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.500 కోట్లు) చెల్లించే విధంగా డియాజియో డీల్ కుదుర్చుకుంది. అయితే, ఈ మొత్తం తమకే చెందాలని.. వేల కోట్లు బకాయిలు పడిన మాల్యాకు ఈ సొమ్మును డియాజియో చెల్లించకుండా ఆదేశించాలంటూ ఎస్బీఐ కాన్సార్షియం డీఆర్టీని ఆశ్రయించింది. దీనితో ఈ డబ్బు మాల్యా విత్‌డ్రా చేసుకోకుండా డీఆర్టీ మార్చి 7న స్టే విధించింది.