డైట్ కళాశాల విద్యార్థుల ధర్నా
కాకినాడ సిటీ, న్యూస్‌లైన్ : బొమ్మూరు డైట్ కళాశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్‌యూ) డిమాండ్ చేసింది. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రిన్సిపాల్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, విద్యార్థులపై మానసిక ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. సంఘ జిల్లా అధ్యక్షుడు జి. చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులతో ప్రిన్సిపాల్ అసభ్య పదజాలంతో మాట్లాడడమే కాకుండా అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
పేరుకే ప్రభుత్వ డైట్ కళాశాల అని, ఇక్కడ చదువుతున్న వారినుంచి వేలాది రూపాయలు కట్టించుకుని, రసీదులివ్వకుండా ప్రిన్సిపాల్ స్వాహా చేశారని ఫిర్యాదు చేశారు. అడ్మిషన్లు రద్దవుతాయని భయపెట్టి విద్యార్థుల నుంచి రూ.5 వేలు కట్టించుకున్నారని ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరిపించాలని, ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏజేసీ మార్కండేయులుకు వారు వినతిపత్రం సమర్పించారు. దీనిపై విచారణ జరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు.