నేటి కష్టాల బడి... రేపటి ఆశీర్వాదాల ఒడి!
సువార్త
మండు వేసవిలో నీళ్లు లేక ఒక తోటలో నారింజ చెట్లన్నీ ఎండిపోతున్నాయి. ‘మహా అయితే మరో పది రోజులు ఈ చెట్లు బతుకుతాయేమో!’ అంటూ పెదవి విరిచాడు తోటమాలి. ‘కాని ఆ మూలన ఉన్న నారింజ చెట్లకు మాత్రం భయం లేదు. ఎందుకంటే నీళ్లు పుష్కలంగా ఉన్నప్పుడు కూడా కావాలనే నేను వాటికి సరిపడా నీళ్లు పోసేవాణ్ణి కాదు. ఫలితంగా అవి తమ వేర్లను భూమిలో లోపలి పొరల్లోకి పోనిచ్చి అక్కడి నీటిని పీల్చి బతకడం నేర్చుకున్నాయి. ఇప్పుడవి ఏ కాలంలోనైనా స్థిరంగా, పచ్చగా, నిర్భయంగా బతగ్గలవు’ అన్నాడా మాలి.
‘నిన్ను ఎన్నుకొని కష్టాల కొలిమిలో పరీక్షించాను’ అంటాడు విశ్వాసితో దేవుడు (యెషయా 48:10,11). విశ్వాసి అందరిలాగా తనకోసం తాను బతికే స్వార్థ జీవి కాదు. అతని జీవితం విలక్షణమైనదిగా ఉండాలన్నది దేవుని అభిమతం. సమాజానికి అతన్ని ప్రయోజనకరంగా మార్చేందుకు దేవుడు తగిన తర్ఫీదును కష్టాలు, కన్నీళ్ల కొలిమిలోనే ఇస్తాడు. దేవుడు మహా గొప్పగా వాడుకున్న బైబిలు విశ్వాస వీరులంతా అలా శ్రమల కొలిమిలో నుండి వచ్చినవారే.
సారెపై రూపుదిద్దుకున్న పచ్చికుండకు ఎండ వేడిమి సరిపోదు. దానికి ప్రత్యేకమైన గుర్తింపు, ప్రయోజకత్వం కొలిమిలోనే దొరుకుతుంది. కష్టాల్లో నేర్చుకునే పాఠాలు, అనుభవాలే విశ్వాసి భావిజీవితానికి బంగారు బాటవేస్తాయి. ‘కష్టాల బడి అతనికి ఆశీర్వాదాల గని’గా మారుతుంది. ఈ లోకం అందరినీ కష్టపెడుతుంది. ఎడమవైపు దొంగను, కుడివైపు దొంగను, పాపరహితుడైన యేసుక్రీస్తును కూడా కలిపి సిలువ వేసిన ‘సర్వసమానత్వపు’ కుళ్లు సమాజం మనది! అయితే దేవుణ్ణి విశ్వసించే జీవితానికి కష్టాలు, శ్రమలు కొత్తమలుపు తిప్పుతాయి.
‘ఏ అర్హతా లేని నాకు ఇన్ని ఆశీర్వాదాలెందుకు?’ అని స్వపరీక్ష చేసుకోని వారికి ‘నాకెందుకీ శ్రమలు?’ అని ప్రశ్నించుకునే హక్కు లేదు. లోకంతో విశ్వాసి రాజీపడడు. లోక ప్రయాణం, విశ్వాసి జీవనయానం పరస్పరం అభిముఖంగా సాగుతాయి. అందుకే శ్రమలు, ప్రతికూలతలు, ప్రతిబంధకాలు. లోకంతో రాజీపడితే భోరున ‘కాసుల వర్షం’! దైవిక నియమాలకు కట్టుబడి ఉండాలనుకుంటే ‘కష్టాల వర్షం’ ఇదే బైబిలులోని విశ్వాస వీరులందరి జీవన సారాంశం.
‘ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకండి, అప్పుడవన్నీ మీకు లభిస్తాయి’ అన్న యేసుక్రీస్తు ఆజ్ఞ విశ్వాసి జీవితాన్ని అనేక మలుపులు తిప్పుతుంది కానీ తుదకు దేవుని సాన్నిధ్యం, ప్రసన్నత అనే ఆశీర్వాదపు గమ్యానికి చేర్చుతుంది (మత్తయి 6:33). పల్లాన్ని వెదుక్కునే క్రమంలోనే కాలువ అనేక మలుపులు తిరుగుతుంది. కాని ప్రతి పల్లం, మలుపు తనను గమ్యానికి చేరువ చేస్తోందన్న విశ్వాసమే కాలువకు ఊపిరినిచ్చి నడిపిస్తుంది. దేవుని సంపూర్ణంగా విశ్వసించడమంటే సుఖాలను, కష్టాలను కూడా దేవుడిచ్చే సమానానుభవాలుగా స్వీకరించడమే!!
బైబిలులోని 66 పుస్తకాల దైవిక సారాంశాన్నంతా క్రోడీకరిస్తే అధిక భాగం శ్రమలు, కష్టాలు, కన్నీళ్లేనని అర్థమవుతుంది. అందుకే ఇన్నేళ్ల తర్వాత కూడా సమకాలీన పరిస్థితులను విశ్లేషించగల సజీవ వాక్యమయింది. దావీదు తదితరులు శ్రమల నేపథ్యంలోనే కీర్తనలు రాశారు. అపోస్తలులు దాదాపుగా తమ పత్రికలన్నీ చెరసాలల్లో ఉంటూ సంకెళ్లతోనే రాశారు. పాత నిబంధనలోని గ్రంథాలన్నీ దేవుని ప్రజల కష్టాల చిట్టాలే! ప్రవక్తల గ్రంథాలన్నీ బానిసత్వపు కాడికింద నలిగిన దేవుని ప్రజల ఆక్రందనలే!
అయితే బైబిలులోని చిట్టచివరిదైన ప్రకటన గ్రంథం యేసుక్రీస్తుతో పాటు విశ్వాసి సాధించబోయే అసమానమైన విజయాన్ని, అతనికి దేవుని సాన్నిధ్యంలో కలుగబోయే నిత్యానందాన్ని వివరిస్తుంది. దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించే వారికి కారుచీకట్లో కూడా దేవుని బాట సుస్పష్టంగా కనిపిస్తుంది. మనల్ని దేవుడు తన మహిమఘటంగా రూపొందించే ప్రక్రియలో అంతర్భాగమే జీవితంలో మనం పొందే అనుభవాలన్నీ!! ‘శ్రమనొంది యుండుట నాకు మేలాయెను’ అన్న దావీదు అనుభవం ఎంత గొప్పదో కదూ!! (కీర్తన 119:71)
- రెవ టి.ఎ.ప్రభుకిరణ్