పోలీసు సిబ్బందికి ఇళ్లు
యలమంచిలి: విశాఖ రేంజ్ పరిధిలో పోలీసు సిబ్బందికి ఇళ్లు (క్వార్టర్లు) నిర్మించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్టు ఉత్తరాంధ్ర డీఐజీ రవిచంద్ర తెలిపారు. స్టేషన్లను సిబ్బంది కొరత వేదిస్తున్నదని, త్వరలోనే కొత్త నియామకాలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు. బుధవారం యలమంచిలి సర్కిల్ పరిధిలో పోలీస్టేషన్ల వార్షిక తనిఖీకి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. జాతీయ రహదారిపై ఇటీవల పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. వీటి నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. పోలీసులు, ప్రజల మధ్య సత్సంబంధాలు మెరుగుపడేందుకు కార్యాచరణ రూపొందించినట్టు చెప్పారు. రేంజ్ పరిధిలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. మావోయిస్టుల ప్రభావం అంతగా లేదన్నారు. సర్కిల్ పరిధిలో యలమంచిలి రూరల్ పోలీస్టేషన్ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
యలమంచిలి టౌన్ పీఎస్ పరిధిలో నాలుగేళ్ల క్రితం పట్టపగలే జెరాక్స్ వ్యాపారి భార్యను హత్య చేసిన కేసును ఇప్పటి వరకు చేధించలేకపోవడం పట్ల ఆయన వద్ద ప్రస్తావించగా.. నాలుగేళ్లు గడిచిపోవడంతో అలాంటి కేసుల్లో పురోగతి అసాధ్యమన్నారు. దాదాపుగా ఆ కేసు మూసివేసినట్టేనన్నారు. ఈ సందర్భంగా సీఐ, ఎస్ఐలకు ఆయన పలు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట నర్సీపట్నం ఏఎస్పీ సత్యయేసుబాబు, యలమంచిలి సీఐ కె.వెంకట్రావు, యలమంచిలి టౌన్, రూరల్ ఎస్ఐలు రామారావు, కె.రామకృష్ణ, సిబ్బంది ఉన్నారు.
ఎస్.రాయవరం స్టేషన్ పరిశీలన
ఎస్.రాయవరం: డీఐజీ రవిచంద్ర ఎస్.రాయవరం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై చర్యలు చేపడుతున్నప్పటికీ జాతాయ రహదారిపై ప్రమాదాలు పెరుగుతున్నాయన్నారు. దీని నియంత్రణకు ప్రతి ఒక్కరులోనూ అవగాహన తప్పనిసరి అన్నారు. తరచూ కేసులు నమోదు అవుతున్న వారిపై కఠినంగా శిక్షలు పడేలా చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.