సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని తరలిస్తే సహించం
– వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మీ
–ధవళేశ్వరంలో ఇరిగేషన్ కార్యాలయాలు బంద్
–నేడు ధవళేశ్వరం బంద్కు పిలుపు
ధవళేశ్వరం : వందేళ్ల పైబడి చరిత్ర కలిగిన ధవళేశ్వరంలోని సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని తరలిస్తే సహించేది లేదని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి హెచ్చరించారు. కాటన్ ఆశయానికి తూట్లు పొడుస్తూ ఏకపక్షంగా కార్యాలయాన్ని తరలించాలని అధికారులు ప్రయత్నించడం దారుణమన్నారు. సెంట్రల్ డివిజన్ కార్యాలయ తరలింపు ప్రతిపాదనకు నిరసనగా సోమవారం జక్కంపూడి విజయలక్ష్మి , వైఎస్సార్ సీపీ రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో ఇరిగేషన్ కార్యాలయాల బంద్ నిర్వహించారు. బంద్ కారణంగా ధవళేశ్వరంలోని ఇరిగేషన్ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. ఈ సందర్భంగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ మైనర్ ఇరిగేషన్ రైతాంగానికి, డెల్టా రైతాంగానికి అందుబాటులో ఉండేలా నాడు కాటన్ మహనీయుడు ఇరిగేషన్ కార్యాలయాలను ధవళేశ్వరంలో ఏర్పాటు చేయించారన్నారు. అయితే నేడు కాటన్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ ప్రజాప్రతినిధుల మెప్పు కోసం కార్యాలయాన్ని ఏకపక్షంగా మార్చడం దారుణమన్నారు. కనీసం ఉద్యోగులకు కూడా తెలియకుండా అమలాపురంలో కార్యాలయ భవనాన్ని ప్రారంభించడం వెనుక మర్మమేమిటని జక్కంపూడి విజయలక్ష్మి ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ రూరల్ కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని ధవళేశ్వరం నుంచి అమలాపురం తరలింపు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ డివిజన్ కార్యాలయాన్ని తరలింపును నిరసిస్తూ మంగళవారం ధవళేశ్వరం బంద్కు పిలుపునిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు సాధనాల చంద్రశేఖర్(శివ), గరగ శ్రీనివాసరావు, పెన్నాడ జయప్రసాద్, ఏజీఆర్ నాయుడు, మిరప రమేష్, షట్టర్ భాషా, బర్రి కామేశ్వరరావు, యర్రంశెట్టి శ్రీరామ్, ఎలీషా జగన్, రామరాజు, సత్యం వెంకటరమణ, గపూర్, తాడాల చక్రవర్తి, బోడపాటి సత్యనారాయణ, కొత్తపల్లి రాము, జంగా కేదార్నాథ్, పిన్నమరెడ్డి సూర్యచంద్రం, కురుమళ్ల ఆంజనేయులు, పడమటి కామరాజు, బొబ్బిలి భాస్కరరావు, పిల్లి కిషోర్, ముత్యాల జాన్ తదితరులు పాల్గొన్నారు.