బడి ఉరుస్తోంది!
ఆదిలాబాద్ (ఉట్నూర్) : మండలంలోని హస్నాపూర్ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరడంతో వర్షాలకు ఉరుస్తోంది. దీంతో తరగతి గదులన్నీ తడిగా మారుతుండడంతో కూర్చునేందుకు స్థలం లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదనపు గదుల నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు.
హస్నాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు ఉండగా, 197 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 8,9 తరగతులను గూనపెంకుల గదుల్లో నిర్వహిస్తున్నారు. అక్కడక్కడ పెంకులు పగిలిపోవడంతో చినుకు పడినా తరగతి గదుల్లోకి నీళ్లు వస్తున్నాయి. చేసేది లేక ఉపాధ్యాయులు గదులపైన పాలిథిన్ కవర్ కప్పించారు.
ఇక ఆరో తరగతి గది గోడ ఓ వైపు కూలింది. వర్షాకాలం కావడంతో గోడ సందుల్లోనుంచి పాములు, ఇతర విషకీటకాలు వస్తుండడంతో విద్యార్థులకు భయాందోళనకు గురవుతున్నారు. పదో తరగతి గది కూడా వర్షానికి ఉరుస్తుండడంతో ఇబ్బందుల మధ్య చదువులు సాగిస్తున్నారు. ఒక్క తరగతి గది కూడా సరిగా లేకపోవడంతో పాఠశాలకు వెళ్లాలంటేనే భయమేస్తుందని విద్యార్థులు వాపోతున్నారు.
ప్రారంభం కాని
పాఠశాలలో నాలుగు అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎనిమిది నెలల క్రితం రూ.30 లక్షలు మంజూరయ్యాయి. వీటి టెండర్లు పూర్తయిన ఇంకా పనులు ప్రారంభం కాలేదు. అదనపు గదుల నిర్మాణం పూర్తయితే ఇబ్బందులు తొలుగుతాయని ఉపాధ్యాయులు అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పం దించి అదనపు తరగతి గదుల పను లు మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు కోరుతున్నారు.