సిగరెట్లతో కేన్సర్ రాదంట!
న్యూఢిల్లీ: సిగరెట్ తాగితే కేన్సర్ వస్తుందని భారత్‌లో ఏ పరిశోధన కూడా ధ్రువీకరించలేదని, అలా అనుకోవటం మూర్ఖత్వమని బీజేపీ ఎంపీ దిలీప్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పొగాకు ఉత్పత్తులన్నింటిపైనా హెచ్చరిక చిహ్నాలు 85శాతం మేర ముద్రించాలన్న కేంద్ర ఆదేశాలు నేటి నుంచి అమల్లోకి వస్తున్న నేపథ్యంలో తమ పార్టీ ఎంపీయే ఇలాంటి వ్యాఖ్యలు చేయటం బీజేపీ సర్కారుకు చిక్కులు తెచ్చిపెట్టింది. సదరు ఎంపీ,పొగాకు ఉత్పత్తుల చట్టం-2003పై వేసిన పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యుడు కూడా. ‘పొగాకుతో కేన్సర్ వస్తుందని భారత్‌లో ఏ పరిశోధనా తేల్చలేదు. పరిశోధనలన్నీ విదేశాల్లోనే జరిగాయి. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీడీ తయారీపై ఆధారపడి 4 కోట్లమంది పనిచేస్తున్నారు’ అని దిలీప్ మంగళవారం అన్నారు.