అల్లుళ్లకు 365 రకాల వంటలతో ఆతిథ్యం
నరసాపురం: గోదారోళ్లు అంటేనే మర్యాదలకు మారుపేరు. సంక్రాంతి సందర్భంగా శని, ఆదివారాల్లో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో రెండు కుటుంబాలు 365 రకాల వంటలతో కొత్త, కాబోయే అల్లుళ్లకు విందు భోజనం పెట్టారు. రైస్‌మిల్లర్ ఆచంట గోవింద్, నాగమణి దంపతుల కుమార్తె అత్యం మాధవి, అల్లుడు జ్యువెలరీ వ్యాపారి వెంకటేశ్వరరావు భీమవరంలో నివాసం ఉంటారు.
వీరి ఏకైక కుమార్తె కుందవికి ఇటీవల తణుకుకి చెందిన ఎన్నారై తుబ్బలపల్లి సాయికృష్ణతో వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ముందే పెద్ద పండుగ రావడంతో సాయికృష్ణను ఆహ్వానించి 365 రకాల ఐటమ్స్ కొసరి కొసరి వడ్డించారు. రైస్, లెమన్‌రైస్, పులిహోర, దద్దోజనం, క్షీరాన్నం, బిర్యానీ ఇలా అన్నంలోనే 30 రకాలు, 50 రకాల స్వీట్లు, 20 రకాల హాట్స్, 100 రకాల పిండి వంటలు, 35 రకాల కూల్‌డ్రింక్స్, 35 రకాల బిస్కెట్స్, 30 రకాల ఐస్‌క్రీమ్స్, 15 రకాల కేక్‌లు తదితరాలు కలిపి మొత్తం 365 రకాలున్నాయి. ఇదే తరహాలో మరో కుటుంబం నాన్‌వెజ్ ఐటమ్స్‌తో అల్లుడికి విందు భోజనం పెట్టారు.
కొత్త అల్లుడు వినయ్‌కుమార్‌కు 365 రకాల వంటలను వడ్డిస్తున్న దృశ్యం
కొబ్బరి ఎగుమతుల వ్యాపారి మానే నాగేశ్వరరావు, అనంతలక్ష్మిల కుమార్తె యశోదసాయి, అల్లుడు వినయ్‌కుమార్‌కు 365 రకాల ఐటమ్స్ సిద్ధం చేసి భోజనం పెట్టారు. సొర, కొరమీను, వంజరం, కట్టెపరిగె, పండుగప్ప, సందువా తదితర రకాల చేపల కూరలు వడ్డించారు. చింతకాయ, పచ్చిరొయ్యలు, చింతచిగురు రొయ్యలు, చింతాకు, చిన్నచేపలు తదితర వంటలు వండారు.