డిప్యుటేషన్ల దందా!
రిమ్స్‌క్యాంపస్:మీరు విశాఖపట్నం నుంచి వస్తున్న స్టాఫ్ నర్సులా...డిప్యుటేషన్ వేయించుకొని అక్కడే ఉండిపోవాలనుకుంటున్నారా..అయితే కాస్త్త ఖర్చు అవుతుంది.. దీనికి మీరు సిద్ధమైతే పూర్తి వివరాలను మీ సీనియర్లను అడిగి తెలుసుకోండి..ఇదీ జిల్లాకే తలమానికంగా ఉన్న రిమ్స్ ఆస్పత్రిలో డిప్యుటేషన్ల దందా. లంచాలివ్వటంలో పోటీ పడుతూ కొంతమంది ఉద్యోగులు కేజీహెచ్‌కు డిప్యుటేషన్లు వేయించుకుంటున్నారు. ఎవరు ఎక్కువ ఇస్తే వారికే డిప్యుటేషన్ వేస్తామని, ఇంకా ఎక్కువ ఇస్తే విశాఖపట్నంలోనే కదపకుండా ఉంచేస్తామంటూ సంబంధిత గుమస్తా ఆఫర్లమీద ఆఫర్లిస్తున్నారు. రిమ్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్న స్టాఫ్‌నర్సుల్లో ఎక్కువ మంది విశాఖకు చెందిన వారే. నిత్యం వీరంతా విశాఖ నుంచి శ్రీకాకుళం రాకపోకలు సాగిస్తున్నారు. కేజీహెచ్‌లోని సూపర్‌స్పెషాలిటీ విభాగానికి కొంత మంది స్టాఫ్ నర్సులు డిప్యుటేషన్‌పై కావాలంటూ మూడేళ్ల కిందట కేజీహెచ్ వారు ప్రతిపాదనలు పంపారు.
తమ వద్ద సిబ్బంది చాలా తక్కువ మంది ఉన్నారని, కొత్తవారిని వేసుకునే వరకు డిప్యుటేషన్లను కొనసాగించాలని కోరారు. దీంతో అప్పటి రిమ్స్ డెరైక్టర్ రామ్మూర్తి ప్రతి మూడు నెలలకోసారి 30 మంది స్టాఫ్‌నర్సులను ఒక బ్యాచ్‌గా కేజీహెచ్‌కు డిప్యుటేషన్‌పై పంపేవారు. మూడు నెలలు పూర్తయిన తరువాత వేరొక బ్యాచ్ వెళ్తుంది. ఇక్కడే సంబంధిత గుమస్తాకు కల్పవృక్షం దొరికింది. నిత్యం విశాఖ నుంచి రాకపోకలు సాగించే స్టాఫ్‌నర్సులు విశాఖ డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు ఎగబడుతున్నారు. విశాఖ నుంచి రాకపోకలు సాగించకుండా అక్కడే ఉంటూ కేజీహెచ్‌లో పనిచేసుకొవచ్చునన్న ఆలోచనే దీనికి కారణం. విశాఖ నుంచి రాకపోకలు సాగించటానికి రోజుకు కనీసం రూ. 250 వరకు ఖర్చు కావడంతోపాటు సమయం కూడా చాలా వరకు వృథా అవుతోంది. దీన్ని తగ్గించుకోవడానికి చాలామంది డిప్యుటేషన్ల కోసం పోటాపోటీగా ఎగబడుతున్నారు.
భారీగా వసూళ్లు
డిప్యుటేషన్ చేయాలంటే ముడుపులు చెల్లించాల్సిందే. ఎవరు ఎక్కువ ఇస్తే వారికే ప్రాధాన్యం ఉంటుందని తోటి స్టాఫ్‌నర్సులే చెప్పుకుంటున్నారు. ఒకొక్కరూ రూ. ఆరు వేలు నుంచి ఆపై పోటీని బట్టి సొమ్ములు చెల్లించి విశాఖకు డిప్యుటేషన్‌పై వెళ్లిపోతున్నారు.
ఒక్కో బ్యాచ్‌ను పంపించినప్పుడు రూ. 5.40 లక్షల నుంచి సుమారు తొమ్మిది లక్షల రూపాయల వరకు వసూళ్లు జరుగుతున్నట్టు తోటి స్టాఫ్‌నర్సులే చెప్పటం గమనార్హం. సంబంధిత గుమస్తా డిప్యుటేషన్ దందాను సాగిస్తున్నట్టు సిబ్బందే చెప్పుకొస్తున్నారు. సాధారణంగా ఒక స్టాఫ్‌నర్సుకు డిప్యూటేషన్ వేయాలంటే నెలకు రూ.ఆరువేలు చొప్పున మూడు నెలలకు రూ.18వేలు వసూ లు చేస్తున్నారని, పోటీ పెరిగిపో తే మరికొంత ఎక్కువ గా సమర్పించుకోవాల్సి వస్తుందని కొంతమంది స్టాఫ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేజీహెచ్‌లో పాతుకుపోయిన పది మంది స్టాఫ్‌నర్సులు
రిమ్స్ నుంచి కేజీహెచ్‌కు డిప్యుటేషన్లు జరుగుతుం డగా పది మంది మాత్రం చాలారోజులుగా కేజీహెచ్‌లోనే పాతుకుపోయారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రతి బ్యాచ్‌కు 30 మంది కొత్తవారు వెళ్లాల్సి ఉండగా.. ఆ పది మంది మాత్రం రాజకీయ పలుకుబడి, భారీగా ముడుపులు చెల్లింపులతో కేజీహెచ్‌లోనే ఉండిపోతున్నారు. దీంతో 20 మంది మాత్రమే ప్రతి బ్యాచ్‌కు మారుతూ వస్తున్నారు. పది మందిని కదపకుండా అలా ఉంచటంపై తోటి స్టాఫ్‌నర్సులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటని సంబంధిత గుమస్తాను నిలదీస్తే రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయం టూ దాటుకుంటున్నారని ఆవేదన చెందుతున్నారు.
అధికారులకూ వాటా!
డిప్యుటేషన్ జరిపిన ప్రతిసారి రూ.లక్షల్లో వసూలు చేస్తున్న సంబంధిత గుమస్తా కొంత మొత్తాన్ని రిమ్స్‌కు చెందిన కొంతమంది అధికారులకు కూడా అందజేస్తున్నట్టు సమాచారం. ఈ కారణంగానే డిప్యుటేషన్లపై ఎన్ని ఆరోపణలు వచ్చినా సదరు అధికారులు పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు రిమ్స్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అసలు రిమ్స్ నుంచి కేజీహెచ్‌కు డిప్యుటేషన్లు అవసరమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
కొసమెరుపు !
రిమ్స్‌లో డిప్యుటేషన్లను తక్షణమే నిలిపివేయాలని ఇటీవల జరిగిన ఆస్పతి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ ఆయన ఆదేశాలను ఆస్పత్రి వర్గాలు పట్టించుకోలేదు. గురువారం కూడా ఒక బ్యాచ్‌ను విశాఖ కేజీహెచ్‌కు పంపించడం కొనమెరుపు.