సూపర్ స్టార్ రజనీ రిహార్సల్స్!
సూపర్ స్టార్ రజనీకాంత్‌కి రిహార్సల్స్ కావాలా? లొకేషన్‌కి డెరైక్ట్ ఎటాక్ ఇచ్చేసి, డెరైక్టర్ ఇలా చెప్పింది అలా సింగిల్ టేక్‌లో చేసేయగల సత్తా ఉంది ఆయనకు. కానీ, రిహార్సల్స్ చేశారు. ‘ఈ స్టయిల్ ఓకేనా? వేరేలా చేయనా?’ అని దర్శకుణ్ణి అడిగితే, అతగాడికి ఏం చెప్పాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అయిపోయాడట. ‘అట్టకత్తి’, ‘మదరాస్’ చిత్రాల ద్వారా దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రంజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రజనీకాంత్ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌కి ముందు వర్క్‌షాప్ నిర్వహించాలని రంజిత్ అనుకున్నారట.
చిత్రబృందం మొత్తాన్ని ఆ వర్క్‌షాప్‌కి హాజరు కావాల్సిందిగా కోరారట. కానీ, రజనీ దగ్గర ‘మీరొద్దు సార్.. డెరైక్ట్‌గా లొకేషన్‌కి వస్తే చాలు’ అన్నారట. అందుకు రజనీ ఏం చెప్పలేదు. మౌనం వహించారు. మొదటిరోజు వర్క్‌షాప్‌లో నటీనటులకు తమ తమ పాత్రలకు తగ్గట్టుగా ఎలా నటించాలో చెప్పడంతో పాటు సాంకేతిక నిపుణులకు కూడా తగిన సూచనలు ఇచ్చారట రంజిత్. రెండో రోజు కూడా ముమ్మరంగా రిహార్సల్స్ జరుగుతుంటే, హఠాత్తుగా రజనీ ప్రత్యక్షమై, తాను కూడా నటించి చూపించారట. ‘ఎలా చేయమంటారో చెయ్యండి’ అని రంజిత్ని అడిగి మరీ, నటించి చూపించారట. దాంతో యూనిట్ మొత్తం ఉబ్బి తబ్బిబైపోయ్యారట! ఏది ఏమైనా... రజనీ స్టయిలే వేరు!