టాటా స్టీల్ చైర్మన్ పదవి నుంచి మిస్త్రీ తొలగింపు
న్యూఢిల్లీ: చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని టాటా స్టీల్ డెరైక్టర్ల బోర్డు తొలగించింది. శుక్రవారం ఈ మేరకు టాటా స్టీల్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు అందించిన సమాచారంలో వెల్లడిస్తూ, మిస్త్రీ స్థానంలో స్వతంత్ర డెరైక్టర్ ఓపీ భట్‌ను తాత్కాలిక ఛైర్మన్‌గా బోర్డు నియమించినట్లు తెలిపింది. కంపెనీ ప్రమోటింగ్ సంస్థ అరుున టాటా సన్స నుంచి అందుకున్న ప్రత్యేక నోటీసు ప్రకారం నవంబర్ 25న తమ డెరైక్టర్ల బోర్డు సమావేశమై ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు టాటా స్టీల్ పేర్కొంది. ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐకి గతంలో చైర్మన్‌గా వ్యవహరించిన ఓపీ భట్...తమ తదుపరి జరిపే అత్యవసర సర్వసభ్య సమావేశం (ఈజీఎం) వరకూ ఈ పదవిలో కొనసాగుతారని కంపెనీ తెలిపింది. కంపెనీ డెరైక్టర్ల పదవుల నుంచి సైరస్ మిస్త్రీని, నుస్లీ వాడియాని తొలగించేందుకు ఉద్దేశించిన ఈజీఎం డిసెంబర్ 21న జరుగుతుంది. టాటా స్టీల్‌లో ప్రధాన ప్రమోటరైన టాటా సన్సకు 29.75 శాతం వాటా వుంది.