‘పందెంకోడి’లా ‘పల్నాడు’ పేరు తెస్తుంది - దాసరి
‘‘విశాల్‌కి ‘పందెంకోడి’ ఎంత మంచిపేరు తెచ్చిందో... ‘పల్నాడు’కూడా అంతటి మంచి పేరు తెస్తుంది’’ అని దాసరి నారాయణరావు అన్నారు. సుశీంద్రన్ దర్శకత్వంలో విశాల్ నటించి, నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విశాల్ ఈ సినిమా పాటలను దాసరి నారాయణరావుకి ప్రత్యేకంగా వినిపించారు. పాటలు అద్భుతంగా ఉన్నాయని అభినందనలు తెలియజేస్తూ దాసరి పై రీతిగా స్పందించారు. ఇంకా చెబుతూ -‘‘నాకు ఎంతో ఆప్తుడైన పి.డి.ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ చిత్రం రాష్ట్రం అంతా విడుదల కావడం ఆనందంగా ఉంది. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సుశీంద్రన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచి ఉంటాడు. ‘పల్నాడు’ అనే టైటిల్ పెట్టడం చాలా బాగుంది’’ అన్నారు. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోందని, సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయని విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ నిర్మాణ సారథి వడ్డి రామానుజం తెలిపారు.