అతను తోడేలు: సచిన్
ఎవరి నమ్మకం గెలిచింది?
చేతులు సాఫ్ట్‌గా ఉండేవాడు మర్డర్ చేయడని నమ్మే పోలీసాఫీసర్.. చంపడం చేతుల్లో ఉండదు మైండ్‌లో ఉంటుందని నమ్మే ప్రేమికుడు.. నచ్చిన అమ్మాయిని దక్కించుకునేందుకు చంపడం తప్పు కాదని నమ్మే విలన్. వీరిలో ఎవరి నమ్మకం గెలిచింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘వీడెవడు’ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు తాతినేని సత్య. సచిన్ జోషి, ఇషా గుప్తా జంటగా రైనా జోషి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రచార చిత్రాన్ని సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ– ‘‘నేను చేసిన ‘ఎస్.ఎమ్.ఎస్’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘శంకర’.. ఈ మూడూ రీమేక్ చిత్రాలే. ఇన్ని రోజుల తర్వాత స్ట్రైట్‌గా చేస్తున్న చిత్రం ఇది. సచిన్ అద్భుతంగా నటించారు. థమన్ మంచి సంగీతం అందించారు. మేలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘అందరూ ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ఇది. అందుకే అవుట్‌పుట్ బాగా వచ్చింది’’ అన్నారు సచిన్. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గుడిమిట్ల శివప్రసాద్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కెమేరా: బినేంద్రమీనన్.
అతను తోడేలు: సచిన్
నటుడు–నిర్మాత బండ్ల గణేశ్, హీరో సచిన్ మధ్య మనస్పర్థలు నెలకొన్న విషయం తెలిసిందే. ‘వీడెవడు’ ప్రెస్మీట్లో గణేశ్ గురించి సచిన్ దగ్గర ప్రస్తావించగా ఆయన ఘాటుగా స్పందించారు. ‘‘బండ్ల గణేశ్‌తో నేను పోరాడను. ఎందుకంటే నా స్థాయితో పోల్చితే అతను చాలా తక్కువ. నా దృష్టిలో బండ్ల గణేశ్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు బండ్ల గణేశ్ ఏదో ఇంటర్వ్యూలో సచిన్ జోషి ఎవరు? అని అన్నాడంట. నాకు మాత్రం ‘వీడెవడు’ అనిపిస్తోంది. ప్రపంచంలో కుక్కలు ఉంది మొరగడానికే. వాటి అరుపులకు బెదరనవసరం లేదు.
నా దృష్టిలో బండ్ల గణేశ్ కుక్కగా కూడా పనికి రాడు. కుక్కలు విశ్వాసంగా, నిజాయితీగా ఉంటాయి. అతను తోడేలు లాంటివాడు. అతను ఏం సాధించాడన్నది నాకు అనవసరం. దేశంలో ఉన్న న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం ఉంది. చట్టం తప్పు చేసిన వారిని శిక్షిస్తుంది. నేను అతని గురించి, తాను నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు’’ అని సచిన్ అన్నారు