‘టెన్స్’ వాడితే మీ నడుము టెన్షన్ దూరం!
హోమియో కౌన్సెలింగ్
మా పాప వయసు మూడున్నరేళ్లు. ఇప్పటినుంచే చాలా మొండిగా ప్రవర్తిస్తోంది. అడిగినవి ఇవ్వకపోతే తల గోడకేసి కొట్టుకోవడం వంటివి చేస్తోంది. డాక్టర్‌కు చూపిస్తే ఆటిజమ్ కావొచ్చని అన్నారు. దీనికి హోమియోలో మందులున్నాయా?
- పూర్ణిమ, మంచిర్యాల
ఆటిజమ్ మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. ఆటిజమ్‌లో వివిధ లక్షణాలు, ఎన్నో స్థాయులు, మరెన్నో భేదాలు ఉంటాయి. ఆటిజమ్ ఉన్న వారందరూ ఒకేలా ఉండకపోవచ్చు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే అన్ని జన్యువులు, క్రోమోజోములు కూడా ఆటిజమ్‌కు దోహదం చేస్తున్నట్లు భావిస్తున్నారు. మెదడులో సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయన మార్పులు కూడా కారణం కావచ్చు.
లక్షణాలు: అకారణంగా ఏడుస్తూ ఉండటం, గంటల తరబడి స్తబ్దుగా ఉండటం, వయసుకు తగినట్టుగా శారీరక, మానసిక అభివృద్ధి లేకపోవడం మొదలైనవి.
ఆటిస్టిక్ డిజార్డర్: ఎక్కువగా కనపడే ఆటిజం సమస్య ఇదే. దీన్ని చైల్డ్‌హుడ్ ఆటిజం అంటారు.
థాట్స్ డిజార్డర్: ఇది ఆడపిల్లల్లో ఎక్కువగా కనపడుతుంది. ఇందులో పుట్టిన ఏడాది వరకు పిల్లలు బాగానే ఉంటారు కాని తర్వాత నెమ్మదిగా లక్షణాలు బయటపడుతుంటాయి. ఇవి రెండు మూడేళ్లలోనే వేగం అవుతాయి. అప్పటికి వచ్చిన ఒకటిరెండు మాటలూ మర్చిపోతారు.
ఆస్పర్జెర్స్ డిజార్డర్: సాధారణంగా ఆటిజమ్ ఉన్న పిల్లల్లో మాటలు ఆలస్యంగా వస్తుంటాయి కానీ ఈ ఆటిజంలో మాటలు మామూలు
గానే ఉంటాయి. నలుగురిలోకీ వెళ్లడం, తెలివితేటలు బాగానే ఉంటాయి. కాని తక్కువ మాట్లాడతారు. అడిగిన దానికి సమాధానం చెప్పి ఆపేస్తారు. శరీరాకృతి చిన్నగా ఉంటుంది. మిగతా ఆటిజమ్ పిల్లల్తో పోలిస్తే వీరు చురుగ్గానే ఉంటారు. అయితే ప్రవర్తన సమస్యలు, కోపోద్రేకాలు అధికం.
చైల్డ్‌హుడ్ డిజింటిగ్రేటెడ్ డిజార్డర్: ఇది ఆటిజమ్‌లో తీవ్రమైన సమస్య. వీళ్లు పుట్టినప్పుడు బాగానే ఉంటారు. ఒకటి రెండేళ్ల వరకు ఎదుగుదల కూడా బాగానే ఉంటుంది. పాకటం, నిలబడటం, మాట్లాడటం అన్నీ మామూలుగానే వస్తాయి. ఆ తర్వాత ఎదుగుదల వెనక్కి మళ్లడం మొదలవుతుంది. లక్షణాలు చాలా వేగంగా కనపడతాయి. ముఖం రఫ్‌గా, ముదిరినట్టుగా ఉండటం, తలకట్టు కిందికి ఉండటం, పొట్టిగా, లావుగా ఉండటం వంటివి కనపడతాయి.
మీరు చె బుతున్న లక్షణాలను బట్టి మీ పాపకు ఆటిజమ్ అంత తీవ్రంగా ఉన్నట్లుగా అనిపించడం లేదు. కొందరిలో వయసు పెరుగుతున్న కొద్దీ క్రమంగా దారిలోకి వస్తారు. అయితే మీరు అశ్రద్ధ చేయకుండా నిపుణులైన హోమియో డాక్టర్‌ను కలిసి, వారి పర్యవేక్షణలో మీ పాపకు చికిత్స చేయించడం మంచిది.
డాక్టర్ ఎ.ఎం. రెడ్డి
సీనియర్ డాక్టర్
పాజిటివ్ హోమియోపతి
హైదరాబాద్
ఫిజియోథెరపీ కౌన్సెలింగ్
నా వయసు 75 ఏళ్లు. డిస్క్ ప్రొలాప్స్ సమస్యతో బాధపడుతున్నాను. రెండేళ్ల కిందటే ఇలాంటి సమస్య వస్తే ఫిజియోథెరపీ తీసుకొమ్మని డాక్టర్ సూచించారు. అప్పుడు లంబార్ ట్రాక్షన్, స్టిమ్యులేషన్ ప్రక్రియలను 15 రోజుల పాటు తీసుకున్నాను. అప్పట్నుంచి బాగానే ఉంది. కానీ ఇటీవల మళ్లీ అకస్మాత్తుగా భరించలేనంత నొప్పి వస్తోంది. మళ్లీ ట్రాక్షన్ తీసుకోవాలా? దయచేసి వివరించండి.
- సాగర్‌రెడ్డి, కర్నూలు
మరోసారి మీరు ట్రాక్షన్ తీసుకోవడం అంతగా సిఫార్సు చేయదగ్గ ప్రక్రియ కాదు. మీరు కాసిన్ని రోజులు బెడ్‌రెస్ట్ తీసుకోండి. ఈ టైమ్‌లో చదునుగా ఉండే పడకమీద పడుకోండి. ఆ పరుపు కాస్త గట్టిగా ఉండేలా చూసుకోండి. దీనితో పాటు ‘టెన్స్ అప్లికేషన్’ అనే ప్రక్రియ అవసరం. టెన్స్ అంటే... ట్రాన్స్క్యుటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్. ఈ ప్రక్రియ చర్మం ద్వారా అక్కడి నరాన్ని స్టిమ్యులేట్ (ఉత్తేజితం) చేస్తుంది. ఇవి పాకెట్ సైజ్‌లో దొరికేవి లభ్యమవుతుంటాయి. వీటిలో ఒకటి కనీసం ఎనిమిది గంటల పాటు ఉపయోగపడుతుంది. మీ పరిస్థితి మెరుగు పడుతున్న కొద్దీ దీని ఉపయోగాన్ని ఆరు నుంచి నాలుగు గంటలకు తగ్గించవచ్చు. దీన్ని మీరు కనీసం రెండు నుంచి మూడు నెలల పాటు వాడితే మీ పరిస్థితి నార్మల్కు వస్తుంది. అయితే ఒక్క విషయం తప్పనిసరిగా గుర్తించాలి. ఒకవేళ మీకు పేస్‌మేకర్ ఉపయోగించారా లేదా మీకు ఇతరత్రా ఏవైనా గుండె జబ్బులు ఉన్నా దీన్ని ఉపయోగించడం ఎంతమాత్రమూ మంచిది కాదు. మీరు దీని సహాయం తీసుకోదలిస్తే, దీన్ని ఎలా ఉపయోగించాలన్న అంశాన్ని మీకు ఫిజియోథెరపిస్ట్ వివరిస్తారు. మీరు లంబోశాక్రల్ బెల్ట్ కట్టుకోండి. ఆ తర్వాత మీ పరిస్థితి మెరుగుపడుతున్న కొద్దీ, బెల్ట్ కట్టుకునే వ్యవధిని తగ్గించుకుంటూ పోవచ్చు. ఆ తర్వాత మీ నడుము నొప్పి తగ్గడానికి కొన్ని వ్యాయామాలూ చేయించుకోవాలి. అవి మీకు మీ ఫిజియోథెరపిస్ట్ సూచిస్తారు. మీ వెన్ను మీద భారం వేసేవీ లేదా మీ కాళ్లను విపరీతంగా ఉపయోగించాల్సిన వ్యాయామాలు చేయవద్దు. అలాగే మీ శరీరంపై ఉపయోగించే మెషిన్లను సరిగ్గా ఉపయోగించాలి. వీటన్నింటికంటే చదునైన పడకపై వారం రోజుల పాటు తీసుకునే విశ్రాంతి మీకు బాగా ఉపకరిస్తుంది. మంచి రిలీఫ్ ఇస్తుంది.
ఆర్. వినయ కుమార్
హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్
ఫిజియోథెరపీ
కేర్ హాస్పిటల్స్
బంజారాహిల్స్, హైదరాబాద్
న్యూరో కౌన్సెలింగ్
మా పాప వయసు తొమ్మిదేళ్లు. ఎప్పుడూ ఎంతో హుషారుగా, చలాకీగాఉండే మా పాప ప్రవర్తనలో గత ఏడాదిగా ఎన్నో మార్పులు వచ్చాయి. అప్పుడప్పుడు తన ఒక చేయి కొద్దిసేపు కొట్టుకుని ఆగిపోతున్నట్లు ఇటీవల మేము గమనించాం. మా పాపకు ఏ విషయం సరిగ్గా గుర్తుండడం లేదని టీచర్లు చెబుతున్నారు. ఎవరికైనా మంచి వైద్యులకు చూపించండి అని టీచర్లు సూచించారు. మా పాపకు గతంలో కూడా ఎప్పుడూ ఇలాంటి సమస్య రాలేదు. తనకేమవుతుందో కూడా తను మాతో చెప్పుకోలేకపోతున్నట్లు అనిపిస్తుంది. చిన్న వయసులో మతిమరుపు వస్తుందా? అసలు మా పాపకు ఏమైంది? మా పాప మళ్లీ సాధారణంగా మారుతుందా? దయచేసి మా సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు.
- హేమలత, విజయవాడ
పిల్లల ప్రవర్తనలో మార్పులు, మతిమరుపు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. మీరు తెలిపిన వివరాలను బట్టి మీ పాప మూర్ఛ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, వైద్యులు సూచించిన పరీక్షలు చేయించుకుని వ్యాధిని నిర్థారించుకోండి. పిల్లల్లో మూర్ఛ వ్యాధి ఉంటే వారి ప్రవర్తనలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మూర్ఛ వ్యాధి ఉంటే మతిమరుపు వచ్చే అవకాశం ఉంటుంది. మూర్ఛ వ్యధి ఏ వయస్సులోనైనా రావచ్చు. చాలా కారణాల వల్ల మూర్ఛ వ్యాధి వస్తుంది. మెదడులో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి కావడం వల్ల ఈ సమస్య వస్తుంది. దాంతో ప్రవర్తనలో కూడా తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మీరు వైద్యులను సంప్రదిస్తే వైద్యులు మీతో, మీ పాపతో మాట్లాడి సమస్యను గుర్తిస్తారు. కొన్ని సందర్భాలలో కొన్ని రకాల పరీక్షలు నిర్వహించవలసి ఉంటుంది. ప్రస్తుతం పిల్లలకు ఈ తరహా సమస్యలు పెడియాట్రిక్ న్యూరాలజిస్టులు, పెడియాట్రిక్ ఎపిలెప్టాలజిస్టులు కూడా అందుబాటులో ఉన్నారు. మీరు వైద్యులను సంప్రదించకుండా నిర్లక్ష్యం చేస్తే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. పిల్లల ప్రవర్తనలో మార్పులు వచ్చాయని, మార్కులు తక్కువగా వస్తున్నాయని మీ పాపను ఇబ్బంది పెట్టకండి. ఇలాంటి సమస్య ఉన్న పిల్లలకు వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. వ్యాధితత్వం, వయసు, ఇతర పరిస్థితులను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. సకాలంలో సరైన చికిత్స అందించడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు.
డాక్టర్ బి.జె. రాజేష్
సీనియర్ న్యూరోసర్జన్
యశోద హాస్పిటల్స్
సికింద్రాబాద్