కురచ దుస్తులపై కొరడా!
చండీగఢ్: మహిళల కురచ దుస్తుల ధారణపై చండీగఢ్ అధికారులు కొరడా ఝుళిపించనున్నారు. పొట్టి బట్టలేసుకుని బార్లు, డిస్కోతెక్ లకు వెళ్లడానికి వీలు లేకుండా చేయాలని అధికారులు భావిస్తున్నారు. మినీ స్కర్ట్ లు, అసభ్యకరంగా ఉన్న దుస్తులు ధరించి బార్లు, డిస్కోతెక్ లకు వెళ్లడంపై నిషేధం విధించనున్నారు. 'కంట్రోలింగ్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ పబ్లిక్ అమూజ్ మెంట్ 2016' కింద చర్యలు చేపట్టనున్నారు. రాత్రి వేళల్లో పెరిగిపోతున్న అసాంఘిక, జాతివ్యతిరేక కార్యకలాపాలకు నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు.
దీనిపై బార్ యజమానులు, మానవ హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది మోరల్ పోలీసింగ్ కిందకు వస్తుందని పేర్కొన్నారు. నేరాల అదుపుచేసేందుకు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం సరికాదని వాదిస్తున్నారు. అసభ్యకరమైన దుస్తులు వేసుకున్నారని ఏవిధంగా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకే తాము నిబంధనలు రూపొందించామని అధికారులు అంటున్నారు.