సంఘాల బలోపేతానికి కృషి
కాకినాడ సిటీ :
స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కృషి చేస్తామని జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు తాడి నాగదుర్గ తెలిపారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన జిల్లా మహిళా సమాఖ్య కార్యవర్గ సభ్యులు శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలోని డ్వామా సమావేశ హాలులో విలేకర్ల సమావేశం నిర్వహించారు. నాగదుర్గ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 92,641 స్వయం సహాయక సంఘాల్లో 9,05,086 మంది సభ్యులు ఉండగా 69 మండల సమాఖ్యలు, 3,488 గ్రామైక్య సంఘాలతో జిల్లా సమాఖ్య ఉందన్నారు. వెలుగు సిబ్బంది సహకారంతో సంఘాల లోటుపాట్లు, సమస్యలను గుర్తించి వాటి నివారణకు చర్యలు తీసుకోవడంతో పాటు అన్ని పథకాల లబ్ధిని సభ్యులకు చేరేలా చూస్తామన్నారు. సంఘదర్శిని ఆరో విడత కార్యక్రమం ద్వారా ఈ నెల 15వ తేదీ నుంచి జిల్లాలోని సీ, డీ గ్రేడులలో ఉన్న సంఘాలను బలోపేతం చేసి సక్రమంగా సమావేశాలు, పొదుపులు, అప్పుల నిర్వహణ, చెల్లింపులు, పుస్తక నిర్వహణపై అవగాహన పెంచుతామన్నారు. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా నమోదుకాని ఎస్సీ, ఎస్టీ సభ్యులను గుర్తించి సంఘాలుగా ఏర్పాటు చేసి వారి ఆర్థికాభివృద్ధి, జీవనోపాధి పెరిగేలా కృషిచేస్తామన్నారు. ఇప్పటి వరకు మొబైల్ బుక్ కీపింగ్ లావాదేవీలు జరపని సంఘాలతో పాటు కొత్తగా ఎస్సీ, ఎస్టీ సభ్యులతో ఏర్పాటు చేయబోయే సంఘాల సభ్యులకు మొబైల్ బుక్ కీపింగ్‌లో శిక్షణ కల్పిస్తామన్నారు. సమాఖ్య కార్యదర్శి ఎస్.ముత్యాల లక్ష్మి, ఉపాధ్యక్షురాలు కె.కృష్ణవేణి, సంయుక్త కార్యదర్శి సీహెచ్ నళిని, కోశాధికారి ముప్పిడి మేరి పాల్గొన్నారు.