సిటీలో పెరుగుతున్న హృద్రోగులు
12 శాతం మందికి గుండె వ్యాధులు
2020 నాటికి మూడు రెట్లు పెరిగే అవకాశం
అంతర్జాతీయ సదస్సులో నిపుణుల వెల్లడి
సాక్షి, సిటీబ్యూరో : దేశవ్యాప్తంగా సుమారు 4.5 కోట్ల మంది హృద్రోగాలతో బాధపడుతున్నారని.. 2020 నాటికి బాధితుల సంఖ్య మూడు రెట్లు పెరిగే అవకాశముందని హృద్రోగ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఒక్క హైదరాబాద్‌లోనే 12 శాతం మంది హృద్రోగాలతో బాధపడుతున్నారని వారు పేర్కొన్నారు. యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, క్లీవ్‌లాండ్ క్లినిక్‌లు సంయుక్తంగా హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో ఏర్పాటు చేసిన నాలుగో అంతర్జాతీయ సదస్సు శనివారం ప్రారంభమైంది.
డాక్టర్ వి.రాజశేఖర్ అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి యశోద ఎండీ జీఎస్‌రావు ముఖ్య అతిథిగా హాజరుకాగా... క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ వైద్య నిపుణులు సమీర్ కపాడియా, రన్డాల్స్ట్రార్లింగ్, బ్రయన్ గ్రిఫిన్, మణిదీప్ భార్గవ్, మురాత్ టస్కు, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రస్తుతం ప్రతి ఐదుగురు హృద్రోగ బాధితుల్లో ఒకరు త్వరగా మత్యువాత పడుతుండగా.. మరో ఐదేళ్లలోఆ సంఖ్య ప్రతి ముగ్గురిలో ఒకరికి చేరే అవకాశం ఉందని చెప్పారు.
బాధితుల్లో 65 శాతం పురుషులు ఉంటే, 35 శాతం మహిళలు ఉన్నారని.. కానీ, పురుషులతో పోలిస్తే మహిళ ల్లోనే ఆకస్మిక మరణాల రేటు ఎక్కువని పేర్కొన్నారు. ఈ సదస్సులో దేశ విదేశాలకు చెందిన సుమారు 400 మంది హృద్రోగ నిపుణులు పాల్గొని... ఎఫ్ఎఫ్ఆర్, వీఐయూఎస్, ఓసీటీ, హార్ట్ ఫెయిల్యూర్, సీఏడీ, స్టంట్స్ వంటి అత్యాధునిక హృద్రోగ చికిత్సలపై చర్చించారు.
ఈ సందర్భంగా యశోద ఆస్పత్రి ఎండీ జీఎస్ రావు మాట్లాడుతూ.. తమ ఆస్పత్రిలో ఇప్పటికే మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా చేస్తున్నట్లు చెప్పారు. కాలేయ మార్పిడి, బోన్‌మారో ట్రాన్స్ప్లాంటేషన్లను కూడా త్వరలోనే చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే మధుమేహ రాజధానిగా మారుతున్న హైదరాబాద్‌లో భవిష్యత్తులో హృద్రోగుల సంఖ్య పెరగనుందని డాక్టర్ వి.రాజశేఖర్ పేర్కొన్నారు.
మారిన జీవనశైలి, అధిక బరువు, పెరుగుతున్న కాలుష్యం, ఆహారపు అలవాట్ల కారణంగా.. పాతికేళ్లకే గుండె జబ్బుల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. కాగా.. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు వహించి, విధిగా వ్యాయామం చేస్తే గుండె వ్యాధులను నివారించవచ్చని డాక్టర్ సమీర్ కపాడియా చెప్పారు. ఒకసారి వేడి చేసిన నూనెలను మళ్లీమళ్లీ మరిగిస్తూ ఉపయోగించడం వల్ల కొవ్వు రెట్టింపు స్థాయిలో ఉత్పత్తి అవుతుందని.. ఇది ఊబకాయానికి దారి తీస్తుందని డాక్టర్ టి.శశికాంత్ తెలిపారు.