ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ఇచ్చిన హామీలన్నీ అమలు
మల్లన్న సాగర్ నిర్మించి తీరుతాం
నిర్ణీత గడువులోగా మిషన్ భగీరథ పూర్తి
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
హన్మకొండ : ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం హన్మకొండ నయీంనగర్‌లోని టీఆర్ఎస్ నగర కార్యాలయంలో టీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్, ముఖ్యమంత్రి కె.చంద్రఖర్రావు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ ముందుకు పోతున్నారన్నారు. ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు. నామినేటెడ్ పదవులు త్వరలో భర్తీ చేయనున్నారన్నారు. పార్టీ కోసం పని చేసిన వారికి గుర్తింపు తప్పక ఉంటుందన్నారు.
అభివృద్ధి పథకాలకు అడ్డంకులు
మల్లన్నసాగర్ ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు కావాలని రాద్దాంతం చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల నిర్మాణం జరిగితే వారికి పుట్టగతులు లేకుండా పోతుందనే భయం వారిని వెంటాడుతుందని, దీంతో అభివృద్ధి పథకాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఎమ్మెల్సీ దుయ్యబట్టారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్సీ రాజేశ్వరరెడ్డి అన్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళిక
సమావేశంలో ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతున్నానన్నారు. ప్రతి నెలలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా వారి మనోభావాలు తెలుసుకుంటున్నానని ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ అన్నారు. అంతేకాకుండా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి నేరుగా వారి వద్దకు వెళ్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. ఈ సమావేశంలో వరంగల్ మహానగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్, కార్పొరేటర్లు దాస్యం విజయ్‌భాస్కర్, అనిశెట్టి మురళీమనోహర్, వీరగంటి రవీందర్, మిడిదొడ్డి స్వప్న, సోబియా సబాహత్తో పాటు టీఆర్ఎస్ నాయకులు మర్రి యాదవరెడ్డి, గుడిమల్ల రవికుమార్, కె.వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.