జీఎస్టీపై నేడు కాంగ్రెస్ అసమ్మతి పత్రం!
న్యూఢిల్లీ: వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుపై అసమ్మతి పత్రం (డిసెంట్ నోట్) ఇవ్వటానికి కాంగ్రెస్ సంసిద్ధమైంది. బిల్లులో తాము కోరిన ఐదు మార్పుల్లో దేనినీ ఎంపిక కమిటీ ఆమోదించేలా లేకపోవటంతో అసమ్మతి పత్రం ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటివరకూ మినహాయింపు ఉన్న పొగాకు, విద్యుత్‌ను జీఎస్టీలో చేర్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లులో ఉన్న విధంగా.. వివాద పరిష్కారం నిబంధనను కూడా కొత్త బిల్లులో చేర్చాలని డిమాండ్ చేస్తోంది. జీఎస్టీ 18 శాతం మించరాదని గరిష్ట పరిమితిని బిల్లులో విధించాల్సిందిగా పట్టుపడుతోంది.
వీటిలో ఏవీ అంగీకరించే అవకాశాలు కనిపించకపోవటంతో.. బీజేపీ ఎంపీ భూపీందర్‌యాదవ్ నేతృత్వంలో శుక్రవారం సమావేశం కానున్న 21 మంది సభ్యుల ఎంపిక కమిటీ భేటీలో అసమ్మతి పత్రం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది.