13న మెగా లోక్ అదాలత్
విశాఖ లీగల్: ప్రజా న్యాయపీఠం సేవలు శాశ్వతమైనవని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.జయసూర్య అన్నారు. విశాఖ జిల్లా కోర్టు ఆవరణలో నగరంలోని వివిధ బ్యాంకుల అధికార ప్రతినిధులతో గురువారం సాయంత్రం సమావేశమయ్యారు. వచ్చేనెల 13న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యంగా భారత జాతీయ బ్యాంకుల చట్టం 138ని ఉటంకించారు. చట్టపరిధిలో రాజీ కాగలిగిన బ్యాంకు కేసులను తక్షణమే గుర్తించి రాజీ ప్రయత్నాలు చేయాలన్నారు. కక్షిదారులు, న్యాయవాదులు, కంపెనీలు యాజమాన్యాలను పిలిచి మాట్లాడాలని సూచించారు. లోక్అదాలత్ కార్యదర్శి ఆర్.వి.నాగసుందర్ మాట్లాడుతూ వచ్చే నెల 13న బ్యాంకులు, చెల్లని చెక్కులు, రాజీ కాగలిగిన సివిల్, క్రిమినల్ తగాదాలు, కుటుంబ న్యాయస్థానం పరిధిలోని కేసులు పరిష్కరిస్తామన్నారు. కేసులు పరిష్కరించుకోవాలనుకున్నవారు తక్షణమే తమ న్యాయస్థానం, న్యాయవాది లేదా తగిన వివరాలతో లోక్ అదాలత్ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, బ్యాంకు అధికారులు, లోక్ అదాలత్ సీనియర్ సభ్యులు ప్రసన్నకుమార్, ఆర్.శ్రీనివాసరావు, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.