పిల్ల కుంకవు.. నాకు చెప్పేంత వాడివా..!
విజయనగరం: తీరప్రాంత ప్రజ లందరికీ 250 కిలోమీటర్ల వేగంతో వీచే గాలిని కూడా తట్టుకొనే విధంగా పక్కా ఇళ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. తుపాను దెబ్బకు నష్టపోయిన విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని దిబ్బలపాలెం, ముక్కాం గ్రామాల్లో ఆయన బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థాని కులు తమ గోడును తెలియజేశారు. తుపాను సమయంలో తమను ఎవరూ పట్టించుకోలేదని, నష్టం జరిగిన తరువాత కూడా అధికారులెవరూ రాలేదని దిబ్బలపాలెంవాసులు వాపోయారు.
అయితే చంద్రబాబు వారిని పెద్దగా పట్టించుకోలేదు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం వల్లే ప్రాణ నష్టం జరగలేదని, ఆస్తి నష్టాన్ని మాత్రం ఆపలేకపోయామని సీఎం చెప్పారు. రాష్ట్ర విభజనతో కొన్ని ఇబ్బందులన్నా, బాధితులను ఉదారతతో ఆదుకుంటామన్నారు. తుపాను వల్ల జిల్లాలో 8 మంది మృతి చెందారని, వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మరో రూ. 2 లక్షలు ఇస్తామన్నారు. ముక్కాంలో మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందజేశారు.
తుపాను వల్ల దెబ్బతిన్న ఇళ్లకు రూ.50 వేలతో ఐఏవీ కింద పునర్నిర్మిస్తామని చెప్పారు. నష్టపోయిన కచ్చా ఇళ్లకు రూ.25 వేలు, పూరి ల్లుకు రూ.5 వేలు ఇస్తామన్నారు. పడిపోయిన ఒక్కొక్క కొబ్బరి చెట్టుకు రూ.1,000 పరిహారం చెల్లిస్తామని, ఉపాధి పథకం కింద బాధితులందరికీ పనులు కల్పిస్తామని చెప్పారు. దెబ్బ తిన్న అన్ని పంటలకు పరిహారం అందిస్తామని తెలిపారు. సముద్రంలో కొట్టుకుపోయిన మత్స్యకారుల పడవలకు రూ.10 వేల చొప్పున పరి హారం చెల్లిస్తామని ప్రకటించారు. మత్స్యకారులకు జీవనోపాధి కింద రూ.10 వేలు అందిస్తామని, నిత్యావసరాలు ఇస్తామని తెలి పారు.
పిల్ల కుంకవు.. నాకు చెప్పేంత వాడివా..!
సీఎం ముక్కాం నుంచి తిరిగి వస్తుండగా ముంజే రు గ్రామం వద్ద ప్రజలు కాన్వాయ్కి అడ్డుపడి, చంద్రబాబు మాట్లాడాలని అడిగారు. దీంతో ఆయన కాన్వాయ్ దిగి మాట్లాడారు. ఇంతలో మహిళలతో సహా గ్రామస్తులంతా ముక్తకంఠంతో నిరసన తెలిపారు. ఇంతవరకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ రాలేదని అన్నారు. దీనికి బాబు స్పందిస్తూ ఎంపీడీఓ ఎక్కడని అధికారులను అడిగారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇంతలో వెనుకనున్న ఒక వ్యక్తి ‘‘ఉద్యోగాలు ఇవ్వలేదు నువ్వేం సీఎంవి? మాటల్లో కాదు.. చేతల్లో చూపించాలి’’ అని గట్టిగా అన్నాడు. దీంతో సీఎం ఆవేశానికి లోనయ్యారు. ‘‘ఏం తమాషా చేస్తున్నావు! నీవు పిల్లకుంకవు. నాకు చెప్పేంత వాడివా? దేనికి వచ్చావు? అల్లరి చేయడానికా? ఊరుకో.. గట్టిగా మాట్లాడకు’’అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
నష్టం అంచనాకు 2 రోజుల్లో కేంద్ర బృందం
విశాఖ రూరల్: హుదూద్ తుపాను వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు రెండు మూడు రోజుల్లో కేంద్ర బృందం వస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. బుధవారం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తక్షణ సాయంగా వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. తుపాను నష్టాన్ని అధిగమించిన విధానంపై ఒక బ్లూబుక్ రూపొందిస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడ భారీ తుపాన్లు వచ్చినా ఈ బ్లూబుక్ ఉపయోగపడుతుందన్నారు.
తుపాను వచ్చిన రోజు ప్రజలెవరూ బయటకు రాలేకపోయారని చెప్పారు. తాను అతి కష్టం మీద తరువాతి రోజు విశాఖకు రాగలిగానన్నారు. ఓ నగరాన్ని ఇంత భారీ తుపాను తాకడం ఇదే తొలిసారన్నారు. 48 గంటల్లో మంచినీరు ఇచ్చామని, పెట్రోల్ సమస్య లేకుండా చేశామని, 6 లక్షల ఆహార పొట్లాలు అందించామని వివరించారు. తుపాను సృష్టించిన నష్టం రూ.60 వేల కోట్లా లేక రూ.70 వేల కోట్లా అనే విషయం అంచనాలకు అందడంలేదని చెప్పారు. పూర్తిస్థాయిలో సర్వే చేసిన తర్వాతే నష్టాన్ని అంచనా వేయగలమని చెప్పారు.
పక్కకు ఒరిగిన బాబు ట్రాక్టర్
సీఎం చంద్రబాబు బుధవారం శ్రీకాకుళం జిల్లా కింతలి గ్రామంలో పర్యటిస్తుండగా ఆయన ఎక్కిన ట్రాక్టర్ నీటిలో ఒరిగిపోయింది. సీఎం కాన్వాయ్ కింతలి రహదారి వరకు వచ్చింది.గ్రామంలోని రోడ్డు నీటిలో ముని గిపోవడంతో బాబు, కొందరు ప్రజాప్రతినిధులు ఓ ట్రాక్టర్ ఎక్కారు. వారు గ్రామంలోకి వెళ్తుండగా అది ఒరిగిపోయింది. భద్రతా సిబ్బంది సీఎంను పట్టుకున్నారు. ఇదే గ్రామం వద్ద కాజ్వే వద్ద ట్రాక్టర్ ఆగిపోయింది. దీంతో గ్రామస్తులు కలిసి ట్రాక్టర్నునెట్టి కాజ్వేను దాటించారు.