గెయిల్ బేస్ క్యాంపు వద్ద గ్రామస్తుల ఆందోళన
- తరలించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో
- గెయిల్ అధికారులతో ఎంపీపీ, సర్పంచ్ చర్చలు
ఓదూరు(రామచంద్రపురం) : గ్రామానికి దగ్గరలో ఉన్న గెయిల్ గ్యాస్ పంపిణీ టెర్మినల్ నుంచి తరచు గ్యాస్ లీకవుతోందని, వెంటనే దానిని గ్రామానికి దూరంగా తరలించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని ఓదూరు గ్రామస్తులు గురువారం ఆందోళన చేపట్టారు. బుధవారం రాత్రి ఉన్నట్టుండి పెద్ద శబ్దంతో గ్రామంలో గ్యాస్ లీక్ కావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురై రోడ్లపైకి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీపీ వినకోటి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ కొండేపూడి జానకిరామయ్య గ్రామస్తులతో కలిసి గురువారం గెయిల్ పాయింట్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈమేరకు గెయిల్ బేస్ క్యాంపు గేటు వద్ద గ్రామస్తులు నిరసన తెలుపుతూ కాకినాడ-రామచంద్రపురం రహదారిలో రాస్తారోకో నిర్వహించారు.
దీంతో గెయిల్ బేస్ క్యాంప్ ఇన్చార్జ్ పి. వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు ఇంజనీర్ కేవీకే త్రినాథ్తో ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్ జానకిరామాయ్య, రామచంద్రపురం సీఐ కాశీవిశ్వనాథ్ తదితరులు చర్చలు జరిపారు. క్యాంప్ ఇన్చార్జ్ మాట్లాడుతూ సాధారణ రక్షణ చర్యల్లో భాగంగానే రాత్రి జరిగిందని, అది ప్రమాదమేమీ కాదని స్పష్టం చేశారు. గ్రామస్తుల డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్ జానకిరామాయ్య మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సమక్షంలో పంచాయతీ వద్ద గెయిల్ ఉన్నతాధికారులతో చర్చలు నిర్వహించాలని బేస్ క్యాంప్ అధికారికి తెలిపారు. దీనికి గెయిల్ అధికారులు అంగీకరించటంతో గ్రామస్తులు ఆందోళనను వివరమించారు.