మూడో‘సారీ’ ‘రుణం’ మాటలే
⇒ జిల్లా అభివృద్ధిపై పెదవి విప్పని సీఎం
⇒ కొల్లేరుపై పాతపాటే
⇒ పోలీస్ పహారా నడుమ మొక్కుబడిగా చంద్రబాబు పర్యటన
⇒ ఎంపిక చేసిన రైతులతోనే సాధికార సదస్సు
⇒ జిల్లావ్యాప్తంగా ముందస్తు అరెస్ట్‌లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎప్పుడొచ్చినా అవే ‘రుణం’ మాటలు. ఈసారి కూడా అంతే. 40 నిమిషాల ప్రసంగంలో నాలుగుసార్లు ‘పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేనిది. ఈ జిల్లా తర్వాతే నాకు ఏదైనా.. జీవితంలో పశ్చిమ వాసుల ప్రేమను మరచిపోలేను’ అని చెప్పుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ జిల్లా ప్రజలకు మేలు చేసే ప్రకటన ఏమీ చేయలేదు. ఆరు నెలల కాలంలో ముచ్చటగా మూడోసారి శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు ఎప్పటి మాదిరిగానే ‘రుణం’ మాటలు వల్లె వేశారు. తనకు ప్రియమైన జిల్లా అంటూనే జిల్లా అభివృద్ధికి సంబంధించి ఏ ఒక్క ప్రకటనా చేయలేదు. అన్ని నియోజకవర్గాలూ కట్టబెట్టిన జిల్లాను ప్రగతి బాట పట్టించడం తన బాధ్యత అంటూనే ఎటువంటి వరాలు కురిపించలేదు.
పరిశ్రమలకు భూముల్లేవ్
‘ఈ ప్రాంతానికి చాలా చేయూలనే డిమాండ్లు ఉన్నాయి. చాలామందికి చాలా కోరికలున్నాయి. కానీ.. పరిశ్రమల స్థాపనకు ఇక్కడ భూముల్లేవు. సారవంతమైన, విలువైన భూములు గల ఈ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు స్థలాలు చూడవయ్యా అని కలెక్టర్‌ను ఆదేశించాను. అటవీ భూములుంటే సేకరించమన్నాను. ఆ భూముల్లో పరి శ్రమల స్థాపనకు కృషి చేస్తా. చేపల పెంపకంలో దేశంలోనే మొదటి స్థానానికి జిల్లాను తీసుకు వెళ్తాను. ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాను’ అంటూ గతంలో చెప్పిన విషయాలను శుక్రవా రం సభలోనూ ప్రస్తావించారు.
ఎత్తిపోతలపై డొంక తిరుగుడు
కొల్లేరును మూడో కాంటూరుకు కుదిం చడంపై రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వకుండా సరస్సును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. పోలవరం మండలం పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మాణంపై డొంక తిరుగుడుగా మాట్లాడారు. గురువారం చిత్తూరు పర్యటనలో పోలవరం కుడికాలువ ద్వారా గోదావరి జలాలను మళ్లించి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పిన సీఎం శుక్రవారం పర్యటనలో మాత్రం ఆ విషయమై అస్పష్టంగా మాట్లాడారు. ఎక్కడా ఎత్తిపోతల పథకం ప్రస్తావన చేయకుండా సముద్రంలోకి వృథాగా పోతున్న 3వేల టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించే ఆలోచన చేస్తున్నామన్నారు.
మాణిక్యం వినతిని పట్టించుకోని బాబు
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)ని తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేస్తామని చెబుతూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు సాంకేతికపరమైన సమస్యల పేరిట దానిని వేరే జిల్లాకు తరలిస్తోందనే ప్రచారం ఉందని, ఈ జిల్లాలోనే నిట్ ఏర్పాటు చేయూలని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తన ప్రసంగంలో సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత సుదీర్ఘ ప్రసంగం చేసిన బాబు మంత్రి ప్రతిపాదనపై ప్రస్తావన తేలేదు.
ఉన్నా లేనట్టుగానే ఉప ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి, మిగిలిన మంత్రుల కంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ముందుగానే రైతు సాధికార సదస్సు వేదికపైకి వచ్చారు. సుమారు రెండు గంటలకు పైగా జరిగిన సదస్సులో ఎవరూ ఉప ముఖ్యమంత్రి ప్రస్తావన చేయలేదు. ఆయనకు ప్రసంగించే అవకాశం కూడా ఇవ్వలేదు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యేలు గన్ని వీరాంజనేయులు, చింతమనేని ప్రభాకర్ తమ ప్రసంగాల్లో ఎక్కడా ఆయన పేరును ప్రస్తావించలేదు. ఇక సీఎం కూడా అంతే. దీంతో డెప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప వేదికపై ముభావంగా కనిపించారు.
పోలీసులపై మాగంటి అలక
సీఎం సభా వేదికపైకి వచ్చినా ఎంపీ మాగంటి బాబు మాత్రం రాలేదు. ఆయన సభా వేదికపైకి వస్తూ తనతోపాటు పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను వెంట తీసుకు వస్తుండగా, పోలీసు అధికారులు అడ్డుకున్నారు. దీంతో అలకబూనిన ఎంపీ వేదిక కిందే ఉండిపోయారు. మా ప్రభుత్వంలో కూడా మాకు స్వేచ్ఛ లేదంటూ వ్యాఖ్యానించారు. ఇంతలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ వెళ్లి ఎంపీ బాబును బుజ్జగించి వేదికపైకి తీసుకువచ్చారు.
మొక్కుబడిగా ముగిసిన సదస్సు
జిల్లాలో గత నెలలో నిర్వహించిన జన్మభూమి సభకు చంద్రబాబు రాగా, ఐకేపీ యానిమేటర్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రైతు సాధికార సదస్సుకు పోలీసులు కనీవినీ రీతిలో ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేశారు. గురువారం అర్ధరాత్రి నుంచే జిల్లావ్యాప్తంగా ప్రజా సంఘాల నాయకులను, రైతు సంఘాల నేతలను అరెస్ట్ చేశారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. కైకరంలోని సభా ప్రాంగణంలో రైతుల కంటే పోలీసులే పెద్దసంఖ్యలో ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
సభకు పెద్దసంఖ్యలో ప్రైవేటు స్కూల్ బస్సుల ద్వారా టీడీపీ కార్యకర్తలను తరలించారు. సీఎం ప్రసంగంలో ఎక్కడా వరాల జల్లు లేకుండా చప్పగా సాగడంతో పార్టీ శ్రేణులు సైతం నిరుత్సాహానికి లోనయ్యూయి. గతంలో మాదిరిగా ఎక్కడా అవాంఛనీయ ఘట నలు జరగలేదన్న సంతృప్తి పోలీసు అధికారులు పార్టీ నేతలకు మిగిలింది.
అధికారుల జోలికెళ్లొద్దు
జిల్లా స్థాయి పోలీసు అధికారిని బదిలీ చేయాలని ఇద్దరు ప్రజాప్రతినిధులు చంద్రబాబుకు చెప్పగా తీవ్ర స్థాయిలో స్పందించినట్టు తెలిసింది. ‘నోర్ముయ్.. అధికారుల జోలికెళ్లొద్దు. వాళ్లతో పని చేయించుకోండి’ అని చంద్రబాబు మందలించినట్టు సమాచారం.