Telangana: కొలువులకు ‘కొత్త’ సంకటం
వరంగల్ జిల్లా పోచమ్మ మైదాన్‌కు చెందిన గోపి రెండో తరగతి వరకు ఇంటి పక్కనున్న పాఠశాలలో చదివాడు. మంచి స్కూల్లో ఇంగ్లిష్ మీడియం చదివించాలని 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న నయీంనగర్‌లోని ప్రైవేటు పాఠశాలలో గోపిని తండ్రి చేర్పించాడు. అతను 10వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాడు. ఇప్పుడు పునర్విభజనలో నయీంనగర్ హన్మకొండ జిల్లాలో భాగమవడం, గోపి ఒకటి నుంచి 7వ తరగతిలో ఎక్కువ సంవత్సరాలు నయీంనగర్‌లో చదువుకోవడంతో అతని స్థానికత హన్మకొండ అయింది.
ఎల్బీనగర్కు చెందిన సృజన్ కుమార్ ఒకటి నుంచి మూడో తరగతి వరకు ఎల్బీనగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో, 4 నుంచి 10వ తరగతి వరకు ఉప్పల్‌లోని మరో ప్రైవేటు పాఠశాలలో చదివాడు. ఇంతకుముందు వరకు సృజన్‌ది రంగారెడ్డి జిల్లా స్థానికత. కానీ జిల్లాల పునర్విభజనతో రంగారెడ్డిని 3 జిల్లాలు చేశారు. సృజన్ పాఠశాల విద్యను ఎక్కువ సంవత్సరాలు మేడ్చల్ జిల్లాలో చదవడంతో ఆ జిల్లా స్థానికుడయ్యాడు. ఇక అతను ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే మేడ్చల్ జిల్లాలోని పోస్టులకే దరఖాస్తు చేసుకోవాలి. పుట్టిపెరిగిన రంగారెడ్డి జిల్లాలో 5 శాతం ఓపెన్ కేటగిరీ కోటా కింద దరఖాస్తు చేసుకోవాలి.
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో 80,039 ఉద్యోగ ఖాళీలున్నట్లు సీఎం కేసీఆర్ 4 రోజుల క్రితం అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇందులో జిల్లా కేడర్‌లోని పోస్టులు 39,829. రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం రావడంతో జిల్లా కేడర్ పోస్టుల భర్తీలో స్థానిక, ఓపెన్ కేటగిరీ నిష్పత్తి 95:5గా నిర్ధారించారు. ఈ క్రమంలో జిల్లా కేడర్‌లోకి వచ్చే 39,829 పోస్టుల్లో 95 శాతం స్థానిక అభ్యర్థులతో భర్తీ చేయాలి. కొత్త జోనల్ విధానంతో స్థానిక అభ్యర్థులకు అత్యధిక అవకాశాలు పెరుగుతున్నా ఇప్పుడు స్థానికత తీవ్ర గందరగోళానికి గురి చేస్తోంది. జిల్లాల పునర్విభజనతో అభ్యర్థుల స్థానికత మారింది. కొత్త జిల్లాల సరిహద్దుల్లోని మెజార్టీ అభ్యర్థులకు ఈ సమస్య ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పుట్టి, పెరిగిన జిల్లాలో స్థానిక కోటాలో దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేకపోవడంతో పలువురు అభ్యర్థులు లబోదిబోమంటున్నారు.
స్థానికత ఇలా..
అభ్యర్థి స్థానికతను నిర్ణయించడంలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు చదువును ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ ఏడేళ్లు ఒకేచోట చదవకుంటే ఎక్కువ తరగతులు ఎక్కడ చదివాడో ఆ ప్రాంతం స్థానికతలోకి వస్తాడు. ఈ లెక్కన ఒకటి నుంచి ఏడో తరగతి వరకు గరిష్టంగా నాలుగేళ్లు ఎక్కడ చదువుకుంటే ఆ జిల్లా స్థానికత పరిధిలోకి వస్తారు. ప్రస్తుతం జిల్లా స్థాయి ఉద్యోగాలన్నీ స్థానికత ప్రకారమే భర్తీ చేస్తారు. దీంతో స్థానికత ధ్రువీకరణకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది.
పట్టణ ప్రాంతంతో గజిబిజి
రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాలను 33 జిల్లాలుగా ప్రభుత్వం విభజించింది. ఇందులో హైదరాబాద్ జిల్లా మినహా మిగతా 9 జిల్లాలు 32 జిల్లాలుగా మార్పు చెందాయి. ఇప్పుడు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీలో స్థానికతకు ప్రాధాన్యమిస్తూ నియామకాలు చేపట్టే క్రమం తీవ్ర గందరగోళాన్ని కలిగిస్తోంది. చాలా జిల్లాల్లో పట్టణ ప్రాంతాలను విభజించడంతో స్థానికత సందిగ్ధంలో పడింది. ఉమ్మడి జిల్లా కేంద్రాలకు దగ్గర్లోని పట్టణ ప్రాంతాల్లో కొంత భాగం ఓ జిల్లాలో, మరికొంత భాగం మరో జిల్లాలో చేర్చారు. కొన్నిచోట్ల నగర ప్రాంతాన్ని ఓ జిల్లాగా, గ్రామీణ ప్రాంతాన్ని మరో జిల్లాగా ఏర్పాటు చేశారు.
ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాను 3 జిల్లాలుగా విభజించారు. ఇందులో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మెజార్టీ భాగం పట్టణ ప్రాంతం కావడంతో ఈ రెండు జిల్లాల్లో చాలా మంది అభ్యర్థుల స్థానికతలో మార్పులు జరుగుతున్నాయి. వరంగల్, హన్మకొండ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. మహబూబ్‌నగర్–నారాయణపేట, వనపర్తి–గద్వాల, కరీంనగర్–పెద్దపల్లి జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులు అనేకం. సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా స్కూళ్లు, కాలేజీలు ఉండటం.. దూరం నుంచి వచ్చి పట్టణ çప్రాంతాల్లో చదువుకోవడంతో స్థానికతలో మార్పులు జరుగుతున్నాయి.