కెమిస్టు, డ్రగ్గిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి
మంత్రి కామినేని శ్రీనివాస్
విజయవాడ : కెమిస్టు, డ్రగ్గిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి కామినేని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. కృష్ణా డిస్ట్రిక్ట్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్టు అసోసియేషన్, ఏపీ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం బెంజ్‌సర్కిల్ సమీపంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాలులో ఆదివా రం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థిగా విచ్చేసిన మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ కెమిస్టు, డ్రగ్గిస్టులు ఫార్మసీ లెసైన్స్ కోసం పెట్టుకునే దరఖాస్తులను ఆన్లైన్లో ఉంచుతామన్నారు. ప్రజలకు నాణ్యమైన మందులు అందచేయాలని సూచించారు. విపత్తులు సంభవించినప్పుడు అసోసియేషన్ల తరఫున సేవచేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 15 రోజుల్లోగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో తాను క్యాంప్ కార్యాలయం ఏర్పాటుచేసుకుంటానని తెలిపారు.
ఇల్లు కూ డా నగరంలోనే తీసుకుంటానని ప్రకటించారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా తన క్యాంపు కార్యాలయానికి రావాలని సూచించారు. కెమిస్టు, డ్రగ్గిస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు కలిపి ఒకే కౌన్సిల్ ఉందన్నారు. ఈ రెండు రాష్ట్రాలకు విడివిడిగా కౌన్సిల్ ఏర్పాటు చేసుకున్న తరువాత ఆ కౌన్సిల్లోకి కెమిస్టు, డ్రగ్గిస్టుల నుంచి ఒకరిని తీసుకుంటామని పేర్కొన్నారు. పది రోజుల్లోగా అసోసియేషన్ ప్రతినిధులు తన వద్దకు వస్తే సమస్యలపై చర్చిద్దామని సూచించారు.
నగర మేయర్ కోనేరు శ్రీధర్ మాట్లాడుతూ వచ్చే పుష్కరాల్లోపు కనకదుర్గమ్మ ఫ్లైవోవర్ నిర్మిం చేందుకు ఎంపీ కేశినేని నాని కృషి చేస్తున్నారని ప్రకటించారు. అయితే కార్పొరేషన్ రూ.500 కోట్ల లోటు బడ్జెట్లో ఉందని, ఎలాగైనా ఆ లోటును భర్తీ చేస్తామని తెలిపారు. ప్రజలుకూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా అసోసియేషన్‌కు సంబంధిం చిన స్పెషల్ బులెటిన్‌ను మంత్రి కామినేని శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశినేని నాని, మాగంటి బాబు, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, నగర డెప్యుటీ మేయర్ రమణ, అసోసియేషన్ ప్రతినిధులు వెంకట్రావ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
పేదలకు అందుబాటులో లేని వైద్యం : మంత్రి కామినేని
విజయవాడ : పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యం అందుబాటులో లేదని రాష్ట్ర వైద్య, వైద్యవిద్యాశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆందోళన వ్యక్తంచేశారు. గవర్నర్‌పేటలోని ఐవీ ప్యాలెస్‌లో బీజేపీ నగర శాఖ ఆధ్వర్యంలో మంత్రి కామినేనికి ఆదివారం ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ నేడు వైద్యం ఖరీదైందన్నారు. వైద్యసేవలను మెరుగు పరచగలిగితే తన జీవితం ధన్యమైనట్లేనన్నారు. అనంతరం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రసంగించారు. బీజేపీ నగర అధ్యక్షుడు దాసం ఉమామహేశ్వరరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామ్‌కిషోర్, జిల్లా అధ్యక్షుడు రామినేని వెంకటకృష్ణ, సీమాంధ్ర ఉద్యమ కమిటీ కన్వీనర్ ఉప్పలపాటి శ్రీనివాసరాజు యెర్నేని సీతాదేవి, కారణి ఆర్ముగ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.