విధుల్లో సాంకేతిక పరిజ్ఞానం జోడించాలి
అనంతపురం క్రైం : రోజురోజుకీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని విధుల్లో జోడించి, ప్రజలకు మెరుగైన సేవలందిద్దామని జిల్లా కలెక్టర్ కోన శశిధర్, అనంతపురం రేంజ్ డీఐజీ బి.బాలకృష్ణ, ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు పిలుపునిచ్చారు. స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో పోలీసు శాఖ అధికారులతో పాటు ఆర్టీఏ, ఆర్అండ్బీ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, అటవీ, ఎక్సైజ్, ఆర్టీసీ, వైద్య, ఫోరెన్షిక్ మెడిసిన్, స్త్రీశిశు సంక్షేమ శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సీఐడీ, మునిసిపల్ అధికారులతో అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం ఏం జరుగుతోంది? మున్ముందు ఏం జరగబోతోంది? అనే అంచనాలతో పాటు సమాచారం పోలీసులు సేకరించాలన్నారు. ఇందుకోసం క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్‌ను ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసుకుని అందుకనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. రహదారుల భద్రత కోసం ప్రతి మూన్నెళ్లకోసారి రోడ్డు భద్రతా కమిటీ సమావేశాలు నిర్వహించి, ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలన్నారు.
సామాన్యుడికి సేవలు అందించేందుకు కిందిస్థాయి సిబ్బంది నుంచి జిల్లా అధికారుల వరకు సమన్వయంతో పని చేయాలన్నారు. డీఐజీ, ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు గట్టిగా పని చేస్తే ప్రజలు ప్రశాంతంగా జీవిస్తారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. నిజాయితీ, నిష్పక్షపాతంగా పని చేస్తే ఫ్యాక్షన్ ప్రాంతాల్లో సైతం పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకం కల్గుతుందన్నారు. ఫ్యాక్షన్ నియంత్రణ కోసం ఇదివరకూ తీసుకున్న గ్రామాల సందర్శన, పల్లెనిద్ర, కార్డినల్ సెర్చ్, ఆకస్మిక తనిఖీలు, కానిస్టేబుళ్లతో గ్రామాలపై నిఘా తదితర చర్యలు మున్ముందు కొనసాగించాలన్నారు.
అదనపు ఎస్పీ కే.మాల్యాద్రి, ఏఎస్పీ అభిషేక్ మహంతి, డీఎఫ్ఓ రాఘవయ్య, డీటీసీ సుందర్‌వద్ది, ఆర్టీసీ ఆర్ఎం వెంకటేశ్వరావు, డీఎస్పీలు మల్లికార్జునవర్మ, సుబ్బారావు, రవికుమార్, ఖాసీంసాబ్, సీఎం గంగయ్య, బీ. విజయ్‌కుమార్, నరసింగప్ప, మహబూబ్‌బాషా, వెంకటరమణ, దుర్గాప్రసాద్, నాగరాజు, శివరామిరెడ్డి, ఎస్ఎం బాషా, రామాంజనేయులు, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
విధులు, సాంకేతిక పరిజ్ఞానం, జిల్లా కలెక్టర్ కోన శశిధర్,
Functions, technology, the District Collector Mr. Kona