జిల్లా సహకార అధికారిపై విచారణ
కొవ్వూరు (పశ్చిమగోదావరి) : జిల్లా సహకార అధికారి డి.వెంకటస్వామిపై వచ్చిన ఆరోపణలపై తూర్పుగోదావరి జిల్లా సహకార అధికారిణి టి.ప్రవీణ సోమవారం విచారణ చేపట్టారు. స్ధానిక డివిజనల్ సహకార అధికారి కార్యాలయంలో డీసీవోపై ఫిర్యాదు చేసిన పీఎసీఎస్ కార్యదర్శుల నుంచి వ్యక్తిగతంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో మాట్లాడారు. ఇటీవల జిల్లాలోని 164 మంది కార్యదర్శులు రాష్ట్ర సహకార శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణరెడ్డికి డీసీవో వైఖరిపై ఫిర్యాదు చేశారన్నారు.దీంతో సహకార శాఖ కమీషనర్ విచారణకు ఆదేశించినట్లు ఆమె తెలిపారు.
ప్రధానంగా సొసైటీలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ద్వారా సంఘాల మనుగడను దెబ్బతీస్తున్నారని.. డీసీవోను బదిలీ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆమె తెలిపారు. దీనిలో భాగంగా 164 మంది కార్యదర్శులను సోమవారం విచారణకు హాజరు కావాల్సినదిగా నోటీసులు పంపామని ప్రవీణ తెలిపారు. ఆరోపణలకు సంబంధించిన రుజువులతో హాజరు కావాలని కార్యదర్శులకు సూచించామన్నారు. విచారణ అనంతరం నివేదికను సహకార ఉన్నతాధికారులకు పంపనున్నట్లు ఆమె తెలిపారు. డివిజన్ సహకార అధికారి జీవీ రెడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.