పింఛన్ల పంపిణీలో చేతివాటం !
ఆమదాలవలస: పింఛన్ల సొమ్ము పక్కదారి పట్టిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. ఎన్టీఆర్ భరోసా కింద వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు పంపిణీ చేయగా మిగిలిన సొమ్మును ఆమదాలవలస మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తమ సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నారు. తమ అవసరాలు తీరిన తరువాత తీరిగ్గా ప్రభుత్వానికి జమ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతి నెలా ఒకటవ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు పంపిణీ చేస్తోంది.
ఇందుకుగాను జిల్లా డీఆర్డీఏ కార్యాలయం నుంచి ఆమదాలవలస మండలానికి కొంత సొమ్మును బ్యాంకు ద్వారా అందజేస్తున్నారు. ఈ సొమ్మును ఎంపీడీవో కార్యాలయం తరఫున బ్యాంకు నుంచి డ్రా చేసి పంచాయతీ కార్యదర్శులకు అందజేస్తారు. ఈ సొమ్మును కార్యదర్శులు లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. మండలంలో జూన్ నెలకు 28 పంచాయతీల్లో 5,762 మంది పింఛన్ లబ్ధిదారులకు రూ.62,65,500 ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో 5,269 మందికి రూ.56,76,500 సొమ్ము పంపిణీ చేశారు.
మండలంలో 493 మంది మృతులు, వలస వెళ్లిన వారు ఉండటంతో రూ.5.89 లక్షలు మిగిలిపోయింది. దీనిని కార్యదర్శులు బ్యాంకుల్లో రిటన్‌గా చూపించి, ఆ రశీదులను ఎంపీడీవో కార్యాలయ సిబ్బందికి అందజేశారు. మిగులు సొమ్మును ప్రతి నెలా 15వ తేదీకి డీఆర్డీఏ కార్యాలయానికి జమ చేయాలి. కానీ ఈ నెల 27వ తేదీ గడిచినా.. ఇంతవరకు మిగులు సొమ్ము జమ చేయలేదు. ఈ విషయమై డీఆర్డీఏ కార్యాలయం నుంచి మండల పరిషత్‌కు పలుమార్లు ఆదేశాలు వచ్చాయి.
ఎంపీడీవో రోజారాణి కార్యాలయ సిబ్బందిని విచారించగా, మిగులు సొమ్ము తమ సొంత అవసరాలకు వినియోగించుకున్నట్టు బయటపడింది. ప్రతి నెలా ఈ తంతు సాగుతున్నట్టు సమాచారం. ప్రభుత్వ సొమ్ము ఇలా వినియోగించుకోవడం నేరమని, దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు ఎంపీడీఓ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సొమ్ము రివకవరీ చేసేందుకు ఎంపీడీఓ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ అవినీతి బాగోతం బయటకు పొక్కితే విచారణలో చాలా మంది పేర్లు బయటకు వస్తాయని కార్యాలయ సిబ్బంది గుసగుస లాడుతున్నారు.
విచారణ చేస్తున్నాం
పింఛన్లు పంపిణీ చేయగా, మిగిలిన సొమ్ము డీఆర్డీఏ కార్యాలయానికి జమ చేయకపోవడంతో, అక్కడ నుంచి ఆదేశాలు వచ్చాయి. అప్పుడు అసలు విషయం బయటపడింది. ఈ సొమ్ము ఎవరు వాడుకున్నారో విచారిస్తున్నాం. - ఎం.రోజారాణి, ఎంపీడీఓ, ఆమదాలవలస