రైతులకు ఎలక్ట్రానిక్ పాస్ పుస్తకాలు
* రేషన్ దుకాణాల్లో ప్యాకింగ్ విధానం అమలు
* జేసీ బాబూరావునాయుడు వెల్లడి
దుద్దుకూరు (దేవరపల్లి) : జిల్లాలోని రైతులందరికీ త్వరలో ఎలక్ట్రానిక్ పట్టాదార్ పాస్‌పుస్తకాలు అందజేయనున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు తెలిపారు. దేవరపల్లి మండలం దుద్దుకూరులో శుక్రవారం సాయంత్రం సంబావారి చెరువు వద్ద ముస్లింలకు శ్మశానానికి కేటాయించిన భూమిని జేసీ, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బాబూరావునాయుడు మాట్లాడుతూ జిల్లాలో దొంగ పట్టాదార్ పాస్‌పుస్తకాల ఎక్కువగా చెలామణిలో ఉన్నాయన్నారు.
చింతలపూడి, జంగారెడ్డిగూడెం, నరసాపురం, ఉంగుటూరు మండలాల్లో సుమారు 500 దొంగపాస్ పుస్తకాలతో బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నట్టు నిర్దారణ అయ్యిందన్నారు. రెవెన్యూ వ్యవస్థను పంచాయతీలో విలీనం చేసిన సమయంలో రెవెన్యూ రికార్డుల్లో కొన్ని అవకతవకలు జరిగాయని ఆయన తెలిపారు. కొన్ని మండలాల్లో ఆర్‌ఎస్‌ఆర్‌లో కూడా పో యాయని ఆయన తెలిపారు. డిసెంబరు నాటికి రైతులందరికీ ఎలక్ట్రానిక్స్ పాస్‌పుస్తకాలు అందజేస్తామని చెప్పారు. రేషన్ దుకాణాల్లో ప్యాకింగ్ విధానం అమలు చేయనున్నట్టు చెప్పారు. 4, 8, 12, 16, 20 కిలోల చొప్పున ప్యాకింగ్ చేసి వినియోగదారులకు తరుగులులేకుండా సరఫరా చేయటం జరుగుతుందన్నారు.
గోపాలపురం నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీలకు శ్మశానవాటికల సమస్య ఎక్కువగా ఉందని, స్థలాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. దేవరపల్లి మండలంలోని నల్లరాతి క్వారీలను ఎన్యూమరేషన్ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎకరం భూమికి అనుమతి తీసుకుని మూడు ఎకరాల్లో క్వారీలు తవ్వుతున్నట్టు ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. సర్వే నిర్వహించి క్వారీల యజమానులపై చర్యలు తీసుకంటామని జేసీ తెలిపారు.
పందులు పంటపొలాలను ధ్వసం చేస్తున్నాయని రైతులు జేసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీవో ఎన్.శ్రీనివాసరావు, సర్పంచ్ కె.సౌధామణి, ఉప సర్పంచ్ ముళ్లపూడి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.