ఫుట్‌బాల్ చాంప్ హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: స్కూల్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫౌండేషన్ (ఎస్ఎస్పీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ స్కూల్ జట్టు విజేతగా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు మహబూబ్‌నగర్ జట్టుపై షూటౌట్లో 4-2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1-1 గోల్స్‌తో సమంగా నిలిచాయి. హైదరాబాద్ తరఫున శుభమ్ సాంగ్వాన్ (50వ ని.) గోల్ చేయగా... ఆట చివరి నిమిషాల్లో వినయ్ కుమార్ మహబూబ్‌నగర్ గోల్ అందించాడు.
షూటౌట్లో హైదరాబాద్ గోల్ కీపర్ అలీ సమర్థంగా రాణించడంతో ఆ జట్టు విజేతగా నిలిచింది. అంతకు ముందు జరిగిన సెమీఫైనల్లో హైదరాబాద్ జట్టు 2-0తో రంగారెడ్డిపై గెలవగా... మహబూబ్‌నగర్ జట్టు 1-0తో కరీంనగర్ జట్టును ఓడించింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం ఎస్ఎస్పీఎఫ్ చైర్మన్ హకీమ్ విజేతలకు ట్రోఫీలను బహూకరించారు.