అంతా వాళ్లిష్టం..!
ముగిసిన ఉద్యోగుల బదిలీల ప్రహసనం
* ప్రతి పోస్టుకు రాజకీయ పైరవీలు
* అప్రతిష్ట తీసుకువచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు
* ఆఖరి నిమిషంలో జీఓలనే మార్పించిన ఘనులు
సాక్షి, విశాఖపట్నం: వడ్డించే వాడు మనవాడైతే ఆఖరి వరసలో కూర్చున్నా వచ్చేది వస్తుందని ఊరికే అనలేదు పెద్దలు..ఉద్యోగుల బదిలీ ప్రహసనం ముగిసింది. పాలకుల అండ ఉన్నవారికి అగ్రతాంబూలం దక్కింది. కానీ దీనివల్ల అధికార పార్టీపై మాయని మచ్చ ఏర్పడింది. తమకు నచ్చిన వారికి పోస్టింగ్ తెప్పించుకోవడం కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నాలు చివరి నిమిషం వరకూ కొనసాగాయి. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి పోస్టులో జారీ చేసిన జీఓను గంటల వ్యవధిలోనే మార్చాల్సిన పరిస్థితిని ఇద్దరు ఎమ్మెల్యేలు తీసుకురావడం మరో కొసమెరుపు.
జిల్లా అధికారి స్థాయి నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకూ జిల్లాలో కొన్ని వందల మందికి బదిలీలు జరిగాయి. వాటిలో కొన్ని వివాదాలకు కేంద్రమయ్యాయి. విశాఖ ఆర్డీఓ పోస్టు ఇద్దరు మంత్రుల మధ్య చిచ్చు రేపింది. వివాదం చినికి చినికి గాలివానగా మారి సీఎం దృష్టికి వెళ్లింది. మంత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం బదిలీ వల్లనే గొడవ కనుక దానినే విరమిస్తే మంచిదని చివరికి ప్రస్తుతం ఉన్న అధికారినే కొనసాగించాలని నిర్ణయించారు. అలా ఆ వివాదం సద్దుమణిగింది. జిల్లా సర్వే భూమి రికార్డుల శాఖ ఏడీ పోస్టుకు ఎప్పుడూ లేనంత పోటీ వచ్చింది. ఐదుగురు అధికారులు ఉన్నత స్థాయిలో పైరవీలు చేశారు. కోట్ల రూపాయలు కుమ్మరించడానికి సిద్ధపడ్డారు. ఈ తతంగం వార్తల్లోకి ఎక్కడంతో చివరి నిమిషంలో బదిలీ నిలిచిపోయింది. ఈ పోస్టులో కూడా ప్రస్తుతం ఉన్న ఏడీనే కొనసాగించాల్సి వచ్చింది.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పోస్టుకు బదిలీ ప్రక్రియ ముగిసే ఆఖరి నిమిషం వరకూ పైరవీలు జరిగాయి. ఇక్కడి డీఎంహెచ్ఓ రెడ్డి శ్యామలను శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య అధికారిగా బదిలీ చేసి ఆమె స్థానంలో యు.స్వరాజ్యలక్ష్మిని నియమిస్తూ తొలుత జీఓ విడుదలయ్యింది. విజయనగరం జిల్లా నుంచి స్వరాజ్యలక్ష్మి విశాఖ జిల్లాకు వస్తున్నారని తెలియగానే జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సీఎం పేషీలో పైరవీలు చేశారు. జె.సరోజినికి పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా సంబంధిత శాఖ మంత్రిపై తీవ్ర వత్తిడి తీసుకువచ్చారు. సరోజినికి తమతో పాటు ఇద్దరు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు ఇచ్చినా స్వరాజ్యలక్ష్మిని ఎలా నియమిస్తారంటూ హడావుడి చేశారు. దీంతో చివరి నిమిషంలో జీఓను మార్చి సరోజినికి విశాఖ డీఎంహెచ్ఓగా పోస్టింగ్ ఇచ్చారు.
ఇలా ఉన్నతాధికారుల బదిలీల్లో రాజకీయ నాయకులు ప్రత్యక్షంగా తలదూర్చి పైరవీలు చేసి తమకు అనుకూలంగా ఉండే వారిని తెచ్చుకున్నారు. వారి దయాదాక్షిణ్యాలతో కోరుకున్న పోస్టింగ్ తెచ్చుకున్న అధికారులు వారు చెప్పినట్లు నడుచుకోకమానరు. ప్రాజెక్టులు,పనులు, నిధుల విషయంలో అధికారులను తమ ఇష్టానుసారం నడిపించే అవకాశం ప్రజాప్రతినిధులకు ఈ బదిలీల వల్ల వచ్చింది. ఇక అంతా వాళ్లిష్టమే.