ఏం డిపార్ట్‌మెంటండీ మీది..
పంచాయతీరాజ్ అధికారుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం
వికారాబాద్ : జిల్లా పంచాయతీ రాజ్ శాఖ పనితీరుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్‌లోని మహావీర్ ఆస్పత్రిలోని వాటర్‌గ్రిడ్‌పై కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఆయన పలు అంశాలపై చర్చించారు. వాటర్‌గ్రిడ్ రొటీన్ పని అనుకోవద్దని, మెల్లగా చేద్దాం అనుకుంటే కుదరదని అధికారులను హెచ్చరించారు. పీఆర్ డిపార్ట్మెంట్ ఎస్ఈ ఎక్కడ.. అని ప్రశ్నించగా, అతను రాలేదనే సమాధానం వచ్చింది.
వెంటనే మంత్రి ఈఎన్సీని పిలిచి.. ఏమిటీ మీ శాఖ పనితీరు ఇలా ఉంది.. ఈ రోజు సమీక్ష ఉందని తెలిసి రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించి నిధులొచ్చాయి కదా.. వాటికి టెండర్లు పిలిచారా.. అని ఆ శాఖ ఈఈ ని ప్రశ్నించారు. ఆయన సమాధానం చెప్పలేకపోవడంతో.. మీరు ఆఫీసుకు వస్తున్నారా.. లేదా అని ప్రశ్నించారు. మీ శాఖ రివ్యూ జరుగుతుంటే మీ దగ్గర సమాచారం లేదు.. మీరు ఇదే పని చేస్తున్నారా.. లేదా రియల్ఎస్టేట్ ఏమైనా చేస్తున్నారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కనీసం జిల్లాలో మొత్తం కాంట్రాక్టర్లు ఎంతమంది ఉన్నారో చెప్పండంటూ డీఈలు, ఏఈలను ప్రశ్నించగా ఎవరి నుంచీ సమాధానం రాలేదు. దీంతో మరింత విస్తుపోయిన మంత్రి.. ‘ఏం డిపార్టుమెంటండీ.. మీదీ..’ అంటూ నిర్లక్ష్యంగా ఉన్న వారినందరినీ బదిలీ చేయండని కలెక్టర్‌కు సూచించారు. అనంతరం ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మాట్లాడారు. ఇచ్చిన గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు.