తీరొక్క జిల్లా
ఒక్కో జిల్లాది ఒక్కో విశిష్టత
భిన్న సంస్కృతుల భూపాలపల్లి
వ్యవసాయంలో కీలకంగా వరంగల్
నగర జిల్లాగా హన్మకొండ
గిరిజన జిల్లా మహబూబాబాద్
సాక్షిప్రతినిధి, వరంగల్ : కాకతీయుల రాజధానిగా వరంగల్‌కు గొప్ప చారిత్రక వైభవం ఉంది. వందల ఏళ్లపాటు పాలించిన నైజాం రాజుల హయాంలోనూ వరంగల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. పరిపాలన పరంగా హైదరాబాద్ తర్వాత వరంగల్‌కు ప్రాధాన్యత ఉండేది. నిజాం పాలకుల హయాంలో వరంగల్ ప్రాంతీయ కేంద్రం(సుబేదార్)గా ఉంది. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వరంగల్ జిల్లా ప్రాంతీయ పరిపాలన కేంద్రంగా కొనసాగింది. పలు ప్రభుత్వ శాఖలకు ఉత్తర తెలంగాణ కేంద్రంగా ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఇప్పుడు జిల్లాల పునర్విభజనతో వరంగల్ జిల్లా నాలుగు జిల్లాలుగా మారుతోంది.
వరంగల్, హన్మకొండ, జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ పేర్లతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా విడుదల చేసింది. అభ్యంతరాల ప్రక్రియ అనంతరం జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ముగియనుంది. ఏ జిల్లాలో ఏ మండలం ఉండాలనే విషయంలో కొన్ని మార్పులు ఉంటాయేగానీ... నాలుగు జిల్లాలు ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్తగా ఏర్పడబోయే నాలుగు జిల్లాల్లో ఒక్కోటి ఒక్కో విశిష్టతను కలిగి ఉన్నాయి. రాష్ట్రంలోనే ప్రత్యేకంగా గుర్తింపు పొందేలా ఈ జిల్లాల స్వరూపం ఉండనుంది.
వరంగల్ జిల్లా
–వరంగల్ జిల్లాలో వరంగల్, ఖిలావరంగల్(కొత్తది), హసన్‌పర్తి, వర్ధన్నపేట, ఐనవోలు(కొత్తది), పర్వతగిరి, గీసుగొండ, సంగెం, ఆత్మకూరు, పరకాల, శాయంపేట, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ మండలాలు ఉండనున్నాయి. నగర, గ్రామీణ ప్రజలు సమాన సంఖ్యలో ఉండే జిల్లాగా వరంగల్ ఉండనుంది.
గ్రామీణ ప్రజలు ఎక్కువగా ఆధారపడే వ్యవసాయరంగానికి వరంగల్ కీలకంగా మారనుంది. ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ వరంగల్ జిల్లాలోనే ఉండనుంది. రాష్ట్రంలోని ఏకైక ఆరోగ్య విశ్వవిద్యాలయం, కాకతీయ వైద్య కళాశాల, వ్యవసాయ ప్రాంతీయ పరిశోధన కేంద్రం, వ్యవసాయ విద్యా సంస్థలు, పశుసంవర్థక పరిశోధన సంస్థలు, పశుసంవర్థక కాలేజీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలన్నీ వరంగల్‌లోనే ఉంటున్నాయి. ప్రఖ్యాత భద్రకాళి ఆలయం, ఖిలా వరంగల్, ప్రకృతిసిద్ధంగా పర్యాటక ప్రాంతంగా ఉండే పాకాల చెరువు వరంగల్ జల్లాలోనే ఉండనున్నాయి.
హన్మకొండ జిల్లా
– హన్మకొండ జిల్లాలో హన్మకొండ, కాజీపేట(కొత్తది), ధర్మసాగర్, వేలేరు(కొత్తది), స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు(కొత్తది), జఫర్‌గఢ్, రఘునాథపల్లి, పాలకుర్తి, రాయపర్తి, కొడకండ్ల, నర్మెట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపురం, హుజూరాబాద్, జమ్మికుంట, ఇలందకుంట(కొత్తది) మండలాలు ఉంటాయని ముసాయిదాలో పేర్కొన్నారు. హైదరాబాద్ తర్వాత నగర జనాభా ఎక్కువగా ఉండే జల్లాగా హన్మకొండ ఉండనుంది. గ్రేటర్ వరంగల్‌లోని సగభాగం, హుజూరాబాద్, జమ్మికుంటలో నగర జనాభా ఎక్కువ. జాతీయ సాంకేతిక సంస్థ(నిట్), కాకతీయ విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఇక్కడే ఉన్నాయి. వేయి స్తంభాల గుడి, పద్మాక్షి ఆలయం, పాలకుర్తిలోని సోమేశ్వరలక్ష్మీనర్సింహ ఆలయం హన్మకొండ జిల్లాలోనే ఉండనున్నాయి.
భూపాలపల్లి జిల్లా
– తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ పేరిట ఏర్పాటవుతున్న భూపాలపల్లి జిల్లాకు ఎన్నో ప్రత్యేకతలు ఉండనున్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం, దట్టమైన అడవులు, జలవనరులు, నీటి వసతితో సాగే వ్యవసాయం, గిరిజన ప్రాంతం, ఆదివాసీలు అన్ని ఈ జిల్లాలోనే ఉంటాయి. సింగరేణి కాలరీస్ కొత్తగా చేపడుతున్న బొగ్గు గనులు ఈ జిల్లాలోనే ఉన్నాయి. కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం ఈ జిల్లాలోనే ఉంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మేడారం జాతర, కాళేశ్వరం, రామప్ప, మల్లూరు వంటి ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు భూపాలపల్లి జిల్లాలోనే ఉంటున్నాయి.
భూపాలపల్లి జిల్లాలోనే గోదావరి నదీ తీరం ఎక్కువగా ఉండనుంది. భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు దేవాదుల, త్వరలో నిర్మాణం మొదలయ్యే కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు భూపాలపల్లి జిల్లాలోనే ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలోనే పర్యాటక కేంద్రాలు ఎక్కువగా ఉన్న జిల్లాగా భూపాలపల్లి ఉండనుంది. లక్నవరం, మేడారం, రామప్ప, తాడ్వాయి అడవులు, గోదావరి తీరం వంటి ఎన్నో పర్యాటక కేంద్రాలు ఈ జిల్లాలో ఉన్నాయి. భూపాలపల్లి, చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ, గణపురం, వెంకటాపురం, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కాటారం, మల్హర్రావు, మహాముత్తారం, మహదేవపూర్ మండలాలతో జయశంకర్(భూపాలపల్లి) జిల్లా ఏర్పడనుంది.
–గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో మహబూబాబాద్ జిల్లా ఏర్పడుతోంది. మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్, గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు, డోర్నకల్, కురవి, మరిపెడ, నర్సింహులపేట, కొత్తగూడ, తొర్రూరు, గార్ల, బయ్యారం మండలాలు ఉండనున్నాయి. రాష్ట్రంలోనే గిరిజన జనాభా ఎక్కువగా ఉండే జిల్లాలో మహబూబాబాద్ మొదటి రెండు స్థానాల్లోనే నిలిచే అవకాశం ఉంది. ఇనుము, గ్రానైట్ ఖనిజ నిక్షేపాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు మహబూబాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన జిల్లాగానూ ఇదే ఉండనుంది.