బంద్ ప్రశాంతం
వేకువజామునుంచే కాంప్లెక్స్ వద్ద బస్సులు నిలుపుదల
పలు రాజకీయ పార్టీల ప్రతినిధులను అరెస్ట్ చేసిన పోలీసులు
మూతపడ్డ పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు
శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోరుతూ వివిధ రాజకీయ పక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నిర్వహించిన జిల్లా బంద్ ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం వేకువజామునుంచే ఆందోళనకారులు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకుని బస్సులు కదలనీయకుండా అడ్డుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారంతా కాంప్లెక్స్ వద్ద బైఠాయించడంతో కాంప్లెక్స్ నుంచి ఒక్క బస్సు కూడా కదలలేదు. ఉదయం 11గంటల వరకూ షాపులు తెరచుకోలేదు.
సోమవారం సాయంత్రమే పలు విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపుతో పాఠశాలల యాజమాన్యాలు ముందస్తుగానే మూతపడ్డాయి. ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు కూడా జిల్లా బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించి కాంప్లెక్స్ వద్ద బస్సులు కదలనీయకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి సీపీఐ, సీపీఎం, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులను జర్నలిస్ట్ యూనియన్ నాయకులను అరెస్ట్ చేసి రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు.
అంతకుముందు వైఎస్సార్సీపీ నాయకులు రొక్కం సూర్యప్రకాశరావు, పొన్నాడ రుషి, కోరాడ రమేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామని లోక్‌సభలో ప్రకటించిన బీజేపీ అధికారం చేపట్టాక మాట మార్చడం సరికాదని మోసపూరితమేనని ఆరోపించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే తమ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహనరెడ్డి న్యూఢిల్లీలో ధర్నా నిర్వహించారన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. సీపీఐ నాయకులు చాపర వెంకటరమణ, చిక్కాల గోవిందరావులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధించడంలో టీడీపీ, బీజేపీలు విఫలమయ్యాయని దుయ్యబట్టారు.
ప్రత్యేకహోదా సాధించే వరకూ పోరాడతామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌదరి సతీష్, పుట్టా అంజనీకుమార్, పైడి రవి మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో నాటి యూపీఏ ప్రభుత్వంలో ప్రధాని మన్మోహన్సింగ్ ఏపీకి ఐదేళ్ళు ప్రత్యేకహోదా ప్రకటించగా పదేళ్ళు కావాలని ప్రతిపక్షనేత వెంకయ్య చెప్పారని, ఇపుడు అదికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదా న్యాయమైన డిమాండ్ అన్నారు. విభజన సమయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది కాబట్టే ఇపుడు ప్రత్యేకహోదా ప్రకటించాలని కోరుతున్నామన్నారు.
రాష్ట్ర బంద్‌లో టీడీపీ తప్ప మిగతా అన్ని పార్టీలూ బంద్‌కు మద్దతు తెలిపాయని, అంటే రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావడం ఇష్టం లేదనే అర్థమన్నారు. బంద్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్నాల నరసింహమూర్తి, నంబాళ్ళ రాజశేఖర్, గంజి ఎజ్రా, టి.త్రినాథ్, కె.వి.ఎల్.ఎన్. ఈశ్వరి, ఆర్.సురేష్, జ్యోతిప్రసాద్, సీహెచ్.భాస్కర్, రౌతు సూర్యప్రకాశరావు, వామపక్ష పార్టీలకు చెందిన టేకి గోవిందరావు, రాజేశ్వరరావు, అప్పారావు, కిరణ్, జర్నలిస్టు ప్రతినిధులు గురుగుబెల్లి రాజేశ్వరరావు, సనపల నర్సింహులు, జి.వి.నాగభూషణరావు, ఎం.వి.మల్లేశ్వరరావు, పొడుగు రాజు, సింగూరు బాబ్జి, డోల అప్పన్న, డోల శంకరరావు తదితరులు పాల్గొన్నారు.