‘దేశం’ అగ్ర నేతలపై తమ్ముళ్ల ఆగ్రహం
ఎర్రబెల్లితో వాగ్వాదం
వరంగల్: తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులపై దిగువ శ్రేణి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని బ్రష్టుపట్టిస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం వరంగల్‌లో ఆదివారం జరిగింది. సమావేశంలో ఎంపీ గరికపాటి మోహన్‌రావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఇనుగాల పెద్దిరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రసంగించారు. ఎంపీ గుండు సుధారాణి మాట్లాడి వేదిక దిగుతున్న సమయంలో తూర్పుకోటకు చెందిన కొందరు కార్యకర్తలు అగ్రనాయకులతో పార్టీ భ్రష్టుపట్టిపోతుందని నినాదాలు చేశారు.
గతంలో ఇదే విధంగా శ్రీహరి వ్యవహరించి పార్టీ విడిచిపోయారని, ఇప్పుడు దయాకర్రావువల్ల మళ్లీ అదే పరిస్థితి దాపురించిందన్నారు. దీంతో ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు ఆరోపణలు చేసుకున్నారు. ఇదే సమయంలో వికలాంగుల సంస్థ మాజీ డెరైక్టర్ కంప వినోద్‌కుమార్‌ను ఆయన అనుయాయులు వేదికపై తీసుకువచ్చారు. టీడీపీలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, కొంతమంది నాయకుల వల్లే ఇదంతా జరుగుతున్నదని అన్నారు.
ఈ మాటలకు ఆగ్రహానికి గురైన దయాకర్‌రావు... వినోద్‌కుమార్‌ను ఉద్దేశించి ‘టీడీపీ నీకు ఎక్కువే చేసింది, రాష్ట్ర వికలాంగుల డెరైక్టర్ పదవి ఇచ్చింది, మలేసియా నుంచి రూ.10 లక్షల వ్యయంతో కృత్రిమ కాళ్లను తెప్పించి ఇచ్చింది.’ అని అన్నారు. మాటలు పెరగడంతో వినోద్‌ను తీసుకువెళ్లాలని దయాకర్‌రావు ఆదేశించారు. వెంటనే టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కుర్చీతో సహా వినోద్‌కుమార్‌ను బయటకు తీసుకుపోయారు. ఈ సందర్భంగా వినోద్ తనను తీసుకెళుతున్న వారితో వాగ్వాదానికి దిగారు.
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు...
పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తనను కులం పేరుతో దూషించాడని మాజీ వికలాంగుల సంస్థ డైరె క్టర్ కంపా వినోద్ ఆదివారం మిల్స్‌కాలనీ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు.