తప్పుల తడకగా జిల్లాల నోటిఫికేషన్
జనగామకు అన్ని అర్హతలు ఉన్నాయి
జిల్లాల విభజనను స్వాగతిస్తున్నాం
జనగామ కోసం స్పష్టంగా లేఖ ఇచ్చిన ఏకైక పార్టీ మాదే
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
జనగామ : తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 22న కొత్త జిల్లాలను ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ తప్పుల తడక, అశాస్త్రీయంగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. జనగామ జిల్లా కోసం తలపెట్టిన దీక్షా శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించి మాట్లాడారు.
పరిపాలనా సౌలభ్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జిల్లాల పునర్విభజను స్వాగతిస్తున్నామని, అయితే జిల్లాను విభజించే సమయంలో జనాభా, భౌగోళిక ప్రాధాన్యత, చరిత్ర, సాంస్కృతిక ఐక్యత వంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. కానీ ప్రభుత్వం చేసిన కసరత్తు రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప, ప్రజా ప్రయోజనాల కోసం కాదన్నారు. జిల్లాల విభజనలో వారసత్వ సంపద, సాంస్కృతిక ఐక్యత కనిపించడం లేదన్నారు. వరంగల్‌ను నాలుగు జిల్లాలుగా విభజించే క్రమంలో అభివృద్ధి చెందిన జనగామను ఆ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం సంకోచించడం భావ్యం కాదన్నారు.
పోరాటాలకు వారసత్వంగా ఉన్న జనగామను ఈ విషయంలో విస్మరించడం సిగ్గుచేటన్నారు. జనగామ జిల్లా చేయాల్సిందేనని అఖిలపక్ష సమావేశంలో స్పష్టంగా ప్రభుత్వాని లేఖ ఇచ్చిన ఏకైక పార్టీ తమదేనని స్పష్టం చేశారు. ‘జనగామ జిల్లా చేయాలని అనుకున్నా.. దాంట్లో ఎవరూ కలవడానికి ఒప్పుకోవడం లేదు’ అని సీఎం కేసీఆర్ తమతో చెప్పడం విస్మయానికి గురి చేసిందన్నారు. జనగామ జిల్లా చేసేంతవరకు ఉద్యమం ఆపేది లేదన్నారు.
ఉద్యమకారుడి కాలాన్ని మరిచిన సీఎం
సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమ కాలాన్ని మరచిపోయి.. దొరల కాలంలో ఉన్నట్లుగా భావిస్తున్నాడని తమ్మినేని మండిపడ్డారు. ఆయన అధికారంలోకి వచ్చాక ప్రజా వ్యతిరేక విధానాలతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడని అన్నారు. జనగామలో రెండు నెలలుగా 144 సెక్షన్ అమలు చేస్తూ ప్రజాభిప్రాయం చెప్పమంటే ఎలా అని ప్రశ్నించారు. ఆయన వెంట సీపీఎం డివిజన్ కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, నాయకులు రాళ్లబండి శశిధర్, ఉడుత రవి, బూడిద గోపి, మోకు కనకారెడ్డి, దస్తగిరి, బొట్ల శ్రీనివాస్, దాసరి కళావతి, ఇర్రి అహల్య, మిద్దెపాక సుధాకర్, మల్లయ్య, ప్రకాష్ ఉన్నారు.