తనుశ్రీ దత్తాని నమ్మాలి
ప్రస్తుతం ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమాకు సంబంధించి తనుశ్రీ దత్తా – నానా పటేకర్‌ల వివాదం హిందీ పరిశ్రమలో ఎంతటి చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ విషయంపై తనుశ్రీకి మద్దతుగా బాలీవుడ్ నటులు ఫర్హాన్ అక్తర్, సోనమ్ కపూర్, ప్రియాంకా చోప్రా, కంగనా రనౌత్ వంటి వారు గళం విప్పారు. ఈ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. తాజాగా ‘36 చైనా టౌన్ (2004), ధోల్ (2007)’ సినిమాల్లో తనుశ్రీతో కలిసి వర్క్ చేసిన పాయల్ రోహత్గీ ఈ విషయంపై స్పందించారు.
‘‘ఒక మహిళగా తనుశ్రీ చెప్పిన విషయంపై నాకు నమ్మకం ఉంది. ఆమె మాటలను అందరూ వినాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంఘటనే నాకు 2011లో ఎదురైంది. దర్శకుడు దిబాకర్ బెనర్జీ నాతో అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడు. కానీ చాలా మంది అతను మంచివాడు అన్నారు. ఏ వ్యక్తి అయినా కేవలం వృత్తిపరంగానే కాదు నిజ జీవితంలోనూ విలువలు పాటించాలి. అనురాగ్ కశ్యప్, సుధీర్ మిశ్రా లాంటి వాళ్లు ఒకప్పుడు నా మానసిక స్థితి బాగోలేదన్నారు. ఇప్పుడు తనుశ్రీకి మద్దతుగా అనురాగ్ కశ్యప్ మాట్లాడుతున్నారు.
కాస్త అయోమయంగా ఉంది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘ఇండియాలో స్త్రీవాదం ఉందంటే నాకు నమ్మబుద్ధి కావడంలేదు. దిబాకర్ బెనర్జీ నాతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పడం నా కెరీర్‌పై ప్రభావం చూపించింది. కొంతకాలం నేను సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. టీవీల్లో రియాలిటీ షోలు చేశా. మలయాళం నటుడు దిలీప్‌కుమార్ వివాదం, శ్రీ రెడ్డి వివాదం వంటివి వచ్చినప్పుడు ‘మీ టూ’ లాంటి ఉద్యమాలు ఇండియాలో ఎందుకు ఊపందుకోవడం లేదో అర్థం కావడం లేదు.
కొందరు చేసే ఆరోపణలకు అండగా నిలవడం, కొందరిని తేలికగా తీసుకోవడం.. ఈ వ్యత్యాసం ఎందుకు? అన్ని సంఘటనలను సమానంగానే చూడాలన్నది నా అభిప్రాయం’’ అన్నారు. ఈ సంగతి ఇలా ఉంచి.. నానా పటేకర్, తనుశ్రీ వివాదం గురించి చెప్పాలంటే... ప్రస్తుతం ‘హౌస్‌ఫుల్ 4’ షూటింగ్ కోసం జై సల్మేర్‌లో ఉన్న నానా పటేకర్ ముంబై వచ్చిన వెంటనే ఈ వివాదం గురించి ఓ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేస్తారని ఆయన తరఫు న్యాయవాదాలు చెబుతున్నారు. ఈ వివాదం ఎందాకా సాగుతుంది? అనేది చూడాలి.