విభజన అంశాలన్నీ అమలు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన ప్రతి అంశాన్నీ అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ విషయంలో ఎవరూ ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దని సూచించారు. కొన్ని సాంకేతిక, న్యాయపరమైన కారణాలతో కొన్ని అంశాల విషయంలో కాస్త ఆలస్యమైనా ఓపిక పట్టాలని ఆయన కోరారు. సోమవారం హైదరాబాద్‌లో తపాలాశాఖ తెలంగాణ సర్కిల్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలు రాకుండా చూడాలని, భౌతికంగా విడిపోయినప్పటికీ తెలుగు ప్రాంతాలుగా మానసికంగా ఏపీ-తెలంగాణ ఒక్కటేనన్నారు. ఈ రెండింటి మధ్య సుహృద్భావ వాతావరణానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవచూపాలన్నారు. రాష్ట్ర విభజన లక్ష్యం నెరవేరాలంటే సోదర భావంతో మెలగాల్సి ఉంటుందన్నారు. తమిళనాడు-కర్ణాటక మధ్య చోటుచేసుకున్న ‘కావేరి’ వివాదాల్లాంటివి దేశానికి మంచిది కాదన్నారు. ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశమంతా ప్రతి రాష్ట్రం ఓ తపాలా సర్కిల్‌గా ఉన్న నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు విడివిడి సర్కిళ్లు ఏర్పాటవుతున్నాయని, ఇందులో సోమవారం నుంచి తెలంగాణ సర్కిల్ అమల్లోకి వచ్చిందన్నారు.
వచ్చే నెలలో బీఎస్ఎన్ఎల్ కూడా రెండు సర్కిళ్లుగా రెండు రాష్ట్రాల్లో విడివిడిగా ఉంటుందన్నారు. కాగా, వందశాతం ఈక్విటీతో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులు ఏర్పాటవుతున్నాయని, వచ్చే సెప్టెంబర్ నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని కేంద్ర కమ్యూనికేషన్లు, రైల్వేశాఖ సహాయ మంత్రి మనోజ్‌సిన్హా ప్రకటించారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక తపాలా కార్యాలయాల్లో పొదుపు ఖాతాల సంఖ్య 3 కోట్ల వరకు పెరిగాయన్నారు. కార్మికుల సామాజిక భద్రత పథకాల అమల్లో తపాలాశాఖ పాత్ర కీలకమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి దత్తాత్రేయ అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బి.చంద్రశేఖర్, రీజినల్ పోస్ట్ మాస్టర్ జనరల్ (హైదరాబాద్) కల్నల్ ఎం. ఎలీషా, తపాలా అధికారులు పాల్గొన్నారు.
మగవారికీ ప్రసూతి సెలవు పెంచాలి...
మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులను ఇటీవల 26 వారాలకు పెంచిన నేపథ్యంలో పురుష ఉద్యోగులకూ ప్రసూతి సెలవులను పెంచడం సమంజసంగా ఉంటుందని వెంకయ్య అభిప్రాయపడ్డారు. ప్రసవించిన భార్యకు సహాయకంగా భర్త ఉండాల్సిన అవసరం ఉంటుందన్నారు.
‘హిందీ’పై తారు పూసినందుకు బాధపడ్డా
తమిళనాడులో గతంలో హిందీ వ్యతిరేక ఆందోళన జరిగినప్పుడు నెల్లూరులో తాను యువ నాయకుడిగా పాల్గొన్నానని, ఆ సందర్భంగా తపాలా కార్యాలయం, రైల్వేస్టేషన్లలో గోడలపై ఉన్న హిందీ అక్షరాలపై తారు పూశానని వెంకయ్య గుర్తుచేసుకున్నారు. కానీ తాను ఎంపీ అయ్యాక జాతీయ భాష హిందీ ప్రాధాన్యం తెలుసుకుని ఆ ఘటనకు చింతించానని, హిందీ అక్షరాలపై తారు పూయటమంటే మన ముఖానికి పూసుకున్నట్టేనని వ్యాఖ్యానించారు.
‘భారత మాతకు జై’పై అభ్యంతరమెందుకు?
మా తుఝే సలామ్ అర్థంలో భారత మాతాకుజై అనడంపై కొందరికి అభ్యంతరమెందుకో అర్థం కావటం లేదని వెంకయ్య అన్నారు. సైనికులను విమర్శించేందుకు ఆసక్తి చూపే కొందరికే ఇలాంటి అభ్యంతరాలొస్తున్నాయని, 3 రోజుల క్రితం ప్రధాని కీలక ప్రసంగాన్ని లోపలి పేజీల్లో ప్రచురించిన కొన్ని పత్రికలు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ప్రసంగాన్ని మొదటి పేజీలో ప్రచురించటం కూడా ఈ కోవలోకే వస్తుందన్నారు.