చుక్కలు కలపండి
నేను నా దైవం
చుక్కలు కలపండి! చిన్నపిల్లలకు చుక్కలు కలపడం అంటే భలే ఇష్టం ఆ చుక్కల్లో నుంచే ఓ అందమైన బొమ్మ బయటకు వస్తుందిచుక్కా రామయ్య జీవితంలో అలాంటి చుక్కలు కలిపిన సంఘటనలు ఎన్నో! ‘సరస్వతీ నమస్తుభ్యం’ అనుకున్నప్పుడు చుక్కలు కలిపితే అర్థమైంది... దైవం విద్యలో కాదు... ప్రశ్నించే విద్యార్థిలో ఉందని. రిటైర్మెంట్ తర్వాత అయోమయపు చుక్కలను బాసరలో కలిపితే... కొత్త జీవితం కనపడింది.చుక్కలు స్వయం ప్రకాశకాలు. అలాంటి స్టూడెంట్స్‌కి దారి కలిపిస్తే అదే దైవత్వం. ఒక లక్ష్యం చేరాలంటే.. ముందు లక్ష్యం కనపడాలి. ఆ లక్ష్యం కనపడాలంటే.. మీరూ ఆ చుక్కలను కలపాలి.
లెక్కల్లో ఫార్ములాలతో కుస్తీ పట్టిన నిత్యవిద్యార్థి చుక్కా రామయ్య దైవం ఫార్ములాని ఎలా అర్థం చేసుకున్నారు. తొంభై ఏళ్ల వయసు అనుభవాలలో దైవాన్ని ఎలా దర్శించారు.. తెలుసుకోవడానికి హైదరాబాద్ నల్లకుంటలోని ఆయన నివాసానికి వెళ్లినప్పుడు వేల పుస్తకాల మధ్య ఇలా రుషిలా కనిపించారు.
సర్, పుస్తకాల్లోనే దైవాన్ని చూస్తుంటారా?
(నవ్వుతూ) పుస్తకాల్లో గతం ఉంటుందమ్మా! (ఇంటి లైబ్రరీలోని పుస్తకాలు చూపుతూ) ఇక్కడి చాలా పుస్తకాల్లో ఎన్నో మ్యాథమేటిక్స్‌కు సంబంధించిన ఫార్ములాలు ఉంటాయి. నా దైవం విద్యార్థే!
గురువు దైవంతో సమానం. మీరు గురువు.. అలాంటిది విద్యార్థి దైవం అంటున్నారు?!
నా వరకు విద్యార్థియే దైవం. వేల మంది విద్యార్థులు వేసే ఎన్నో ప్రశ్నల ద్వారా నన్ను నేను కొత్తగా నిర్మించుకున్నాను. వారితో పరిచయం ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. నాకు పుస్తకాల జ్ఞానం ఉంది. కానీ, విద్యార్థుల్లో బాహ్య జ్ఞానం ఎక్కువ చూశాను. పదిహేనేళ్ల క్రితం అనుకుంటాను. ఒక రోజంతా కష్టపడి ఒక ఫార్ములాకి పది స్టెప్స్‌తో సొల్యూషన్ కనుక్కొని చెప్పాను. ఓ పిల్లవాడు కేవలం నాలుగు స్టెప్స్‌తో ఈ ఫార్ములాకి సొల్యూషన్ వస్తుంది అని చేసి చూపెట్టి ఆశ్చర్యపరిచాడు. మరొక విద్యార్థి... ఆదివారం స్పెషల్ క్లాసుకు రమ్మంటే రానన్నాడు. అతను చెప్పిన కారణం నన్ను అమితంగా ఆలోచింపజేసింది. అతడు చదువుకోవడానికి నాలుగురోజులకు సరిపడా మాత్రమే తిండి ఉంది. ఆ ఆదివారం ఊరెళ్ళి తెచ్చుకుంటే తప్ప మిగతా రోజులు గడవవు. అక్షరాల కోసం తాపత్రయపడే పిల్లల వెనక ఆర్థిక లేమినీ గమనించాను. పుస్తకాల కంటే జీవితం నేర్పే అనుభవాలు గొప్పవి. జీవితం గురించి చెప్పేవాడు, అందులోనూ అన్వేషించి చెప్పేవాడు గొప్పవాడు. అవన్నీ నా విద్యార్థుల్లో చూశాను.
మీ విద్యార్థి జీవితంలో దైవం గురించి ఏం తెలుసుకున్నారు?
చిన్నప్పుడు అమ్మనాన్న ఎలా చెప్తే అలా చేసేవాళ్ళం. దణ్ణం పెట్టుకో– అంటే పెట్టేవాళ్లం. బొట్టు పెట్టుకో– అంటే పెట్టుకునేవాళ్లం. ఎందుకు? అని అడిగింది లేదు. ఇక బడిలో విద్యార్థిగా విధేయత కలిగి ఉండటమే! అదే ఆనాటి విద్య లక్ష్యం. అప్పుడు టెక్ట్స్బుక్సే సర్వస్వం. తరగతి గదిలో ఎంత నిశ్శబ్ధంగా ఉంటే గురువు అంత బాగా చదువు చెబుతున్నాడని ఆ రోజుల్లో అనుకునేవారు. ఇప్పుడు పిల్లలు ఎంత ప్రశ్నిస్తే ఆ టీచర్ అంత ప్రావీణ్యుడు. ఇదే మంచిది. ప్రశ్నించడం, విశ్లేషించడం లక్ష్యంగా విద్య ఉండాలి. అప్పుడే దైవాన్ని కొత్తగా అర్థం చేసుకుంటాడు.
సమాజంలో మీరు చూసిన దైవత్వం?
స్వాతంత్య్ర ఉద్యమాలు ముమ్మరంగా జరుగుతున్న రోజులవి. వాటిలో నేనూ పాల్గొనేవాణ్ణి. స్నేహితులతో కలిసి హరిజన వాడలకు వెళ్లి వీధులు ఊడ్చేవాళ్లం. వాళ్ళ ఇళ్లకు వెళ్లి భోజనాలు చేసేవాళ్లం. వాళ్లు దణ్ణం పెట్టి, ‘మాకు పాపం తగులుతుంది’ అనేవారు. తాము ఎన్ని బాధలను అనుభవిస్తున్నా మాకు మట్టి అంటకూడదన్న వారి తపన నన్ను కదిలించింది. దైవం వారిలోనే ఉందనిపించింది. హరిజనులతో కలుస్తున్నానని మా ఇంటిని కులం నుంచి ఏడాది పాటు బహిష్కరించారు. ఆ సమయంలో మా చెల్లెలు రజస్వల అయింది. ఇరుగుపొరుగు వారు వచ్చి జరపాల్సిన వేడుక అది. బహిష్కరణ కారణంగా ఎవరూ రాలేదు. మా చెల్లెలు వెక్కి వెక్కి ఏడ్చింది. అప్పుడనిపించింది.. కొన్ని వేల సంవత్సరాల నుంచి హరిజన కుటుంబాలను సమాజం నుంచి బహిష్కరించి దూరం పెడితే వారెంత వెక్కి వెక్కి ఏడ్చి ఉంటారో అని.. ఆ ఆలోచనకే దుఃఖం వచ్చింది.
దైవప్రార్థనలో మీ బాల్యానికి – ఇప్పటికీ వచ్చిన మార్పులు ఎలాంటివి?
చిన్నప్పుడు నాకు గోళ్లు కొరికే అలవాటు ఉండేది. చూసినప్పుడల్లా అమ్మ కొట్టేది. గోళ్లు కొరికితే అమ్మ కొడుతుంది అనే భయంతో దానిని ఆపేసేవాడిని. వాళ్లకు వివరించి చెప్పడానికి అసలు విషయం తెలియదు. వాళ్ల పెద్దలు అలా చెప్పారు.. వీళ్లూ దాన్నే అనుసరించేవారు. ఈనాటి తల్లి అలా కాదు. పిల్లాడు గోళ్లు కోరికితే.. గోళ్లలో ఉన్నమురికి జీర్ణాశయంలోకి వెళ్లి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అని చెప్తుంది. దీంతో పిల్లవాడు కన్విన్స్ అవుతున్నాడు. ఆలోచించే దిశకు మార్చబడు తున్నాడు. నా చిన్నప్పటి మరో సంఘటన.. ఒకనాడు బడికెళ్లనని ఎవ్వరికీ తెలియకుండా వడ్లు పోసే గుమ్మిలో కూర్చొన్నాను. మధ్యాహ్నానానికి నన్ను వెతికి పట్టుకున్నారు. నేను బడికెళ్లను అని ఏడుస్తున్నాను. అప్పుడు మా చెల్లి ‘మా అన్న రానని ఏడుస్తున్నాడు. నేనొస్తా నాకు చదువు చెప్పండి’ అంది. ఆ మాట వినగానే మా అమ్మ ‘ఆడపిల్లవి.. నీకు చదువు కావాలా?!’ అంటూ కొట్టింది. దీంతో ఏది అడిగినా దండన ఉంటుంది.. అనే భావన ఉండేది. ఇలాగే దైవం అంటే ఎన్నో సందేహాలు, మూఢవిశ్వాసాలు ఉండేవి. తార్కికంగా ఆలోచించకుండా మూఢంగా ప్రవర్తించేవారు. కానీ, నేడు అలా కాదు. ఆడపిల్ల చదువుకుంటే సమాజంలో ఎంత పురోగతి వస్తుందో వివరించే రోజులు ఇవి.
మీరు నిత్యం దైవపూజ చేస్తుంటారా?
పూజ అనేది పూర్తిగా వ్యక్తిగతం. దానిని సామాజిక అంశాల మీదకు రానీయవద్దు. ఇప్పటికీ పూజ చేస్తాను. అయితే, అది ఏకాగ్రతకు సంబంధించింది. సబ్జెక్టులో ఏదైనా సమస్య వస్తుంది. అప్పుడు దాని మీదనే దృష్టి నిలుపుతాను. అది క్లియర్ అయ్యేవరకు మరోవైపు నా దృష్టి వెళ్లదు. చిన్నప్పుడు నాకు ఏకాగ్రత అంటే తెలియదు. మా అమ్మ పూజ చేసేటప్పుడు నన్నూ పక్కన కూర్చోమనేది. నేను దిక్కులు చూస్తుంటే ఎదురుగా ఉన్న ఏదో ఒక వస్తువు మీద దృష్టిపెట్టమనేది. దానినే చూస్తూ కొన్ని నిమిషాలు పాటు అలాగే ఉండిపోయేవాడిని. అది ఒక అలవాటుగా మారింది. ఏ సమస్య వచ్చినా దానిని పూర్తి చేయడానికి రకరకాల మార్గాలు వెతుకుతుంటాను. దృష్టి మరో వైపు వెళ్లదు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నాను. అడిగిన ప్రశ్నకు ఇవ్వాల్సిన సమాధానం దీన్నుంచి దృష్టి మరలదు. అలా దైవ పూజ నాలో ఏకాగ్రతను పెంచింది.
దైవాన్ని తలుచుకునేది కష్టంలోనా, ఆనందంలోనా?!
కష్టంలోనే తలుచుకుంటాం. 55 ఏళ్ల వయసులో టీచర్‌గా రిటైర్ అయ్యాను. అప్పటికి నా కూతురు, కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నారు. చేతిలో పైసా లేదు. తిండికి కూడా అవస్థపడుతున్న రోజులవి. అప్పుడు అడ్వకేట్ వెంకటరామ ప్రసాద్ అని నా గురువులాంటి వారు ‘బాసర వెళ్లిరా’ అని చెప్పారు. వెళ్లి, వారం రోజులున్నాను. ఏదో శక్తి వచ్చినట్టు అనిపించింది. ఇంటికొచ్చాను. అంతకు ముందే మా అమ్మాయి ఐఐటి కౌన్సెలింగ్ కోసం మద్రాస్ వెళ్లి ఉన్నాను. అక్కడ ఐఐటిలో 400 సీట్లు ఉన్నాయి. వాటిలో తెలుగు పిల్లలు ఉన్నది కేవలం 20 మంది మాత్రమే. మిగతా అంతా తమిళియన్లే. తెలుగువారికి ఐఐటీలో ఎందుకు అవకాశాలు తక్కువ అనే మధనం నాలో ఉండేది. నేను మ్యాథ్స్ టీచర్ని కావడంతో బాసర నుంచి వచ్చాక ఐఐటి విద్య కోసం విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. నేనేమీ ఐఐటిలో చదువుకోలేదు. కానీ, కోచింగ్ మొదలుపెట్టాను. బాసరలో ఉండే ఏదో శక్తి నన్నింతవరకు తీసుకువచ్చింది అని నమ్ముతాను. కష్టమే ఎన్నో సమస్యలకు పరిష్కారాలను చూపించింది. ఇందుకో మరో ఉదాహరణ నా జైలు జీవితం. స్వాతంత్రోద్యమ రోజులవి. జైలు జీవితం గడపాల్సి వచ్చింది.
జైలుకు మొదటిసారి వెళ్లినప్పుడు నాకు చిత్రమైన అనుభవం ఎదురైంది. జైలులో ఉద్యమకారులు ఉన్నారు. ‘ఏం చదివావు?’ అని అడిగారు. నాకు తెలిసిన మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులు చెప్పాను. వాళ్లు అవి కాదు సమాజాన్ని ప్రభావితం చేసే పుస్తకాలు అన్నారు. అవేంటో నాకు తెలియదన్నాను. అప్పుడు వాళ్లు ‘నా చేత డిస్కవరీ ఆఫ్ ఇండియా, లెటర్స్ టు ఇందిరాగాంధీ, మై ఇండియా..’ వంటి పుస్తకాలు ఇచ్చి చదవమన్నారు. అప్పటి వరకు నాణేనికి ఒక వైపే చూసిన నేను సమాజం గురించి అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఒక మనిషి పరిపూర్ణంగా ఎదగాలంటే అతనికి సాంకేతికత, సామాజికత ఈ రెండూ తెలియాలి.
బాసర సరస్వతీ దేవి మీకు అపార శక్తిని ఇచ్చిందని నమ్ముతారా? ఇతర దైవ మందిరాలనూ దర్శించుకున్నారా?
బాసరలో ఉన్న శక్తికి ఒక పేరుతో పరిమితం చేయలేను. కానీ, ప్రపంచంలో ఏ జిల్లాలో లేనన్ని వనరులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయని గమనించాను. అక్కడున్న పాజిటివ్ ఎనర్జీ సామాన్యమైనది కాదు. కారణాలు ఇవీ అని చెప్పలేను కానీ, ఇతర దేవాలయాలకు పెద్దగా వెళ్లింది లేదు.
నిరాశ కలిగినప్పుడు దైవాన్ని తల్చుకున్న సందర్భం?
మనలోని శక్తిని గుర్తించకపోతేనే నిరాశ ఆవరిస్తుంది. ఆ శక్తి పేరే దైవం. అందుకే మనల్ని మనం తెలుసుకోవాలి. రిటైర్ అయ్యాక సంపాదన లేక నిరాశలో ఉన్నప్పుడే కదా నేను నా శక్తిని తెలుసుకునే అవకాశం లభించింది. ఇప్పుడు పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని ఈ మధ్య వస్తున్న వార్తల ద్వారా తెలుసుకున్నాను. చాలా బాధ కలిగింది. విద్యార్థి సరైన దారిలో వెళ్లకపోతే అది సమాజానికి చేటు అవుతుంది. ఈ విషయమై కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్తోనూ మాట్లాడాను.
ఈ పిల్లలకు సరైన శిక్ష ఉండాలి అన్నారు. నేను కాదన్నాను. పిల్లలకు విలువలు నేర్పాలి. జీవితమ్మీద నిరాశ కలిగినప్పుడు, అన్నీ ఆయాచితంగా అమరినప్పుడు వ్యసనాల పాలిట పడుతుంటారు. వీటి నుంచి పిల్లలను శిక్షణ వైపు మళ్ళించాలి. ప్రశ్నించే గుణాన్ని, చదువు పట్ల ఆసక్తిని పెంచాలి. ఆ పని తల్లిదండ్రులది, గురువులది. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలి. అప్పుడు విద్యార్థి ఆలోచన పురోగతివైపుకు మళ్లుతుంది.
ఇటీవల మీరు మీ తమ్ముణ్ణి కోల్పోయారు. ఇందుకు దేవుణ్ణి నిందిస్తుంటారా?
అనారోగ్యం వల్ల ఎనిమిదేళ్లు మంచంమీదే ఉన్నాడు వెంకటయ్య (తమ్ముడు). ఇస్రోలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. అలై్జమర్స్ వాడికున్న జ్ఞానాన్ని, జ్ఞాపకాలను తుడిచిపెట్టేసింది. తర్వాత వచ్చిన పార్కిన్సన్స్ మంచానికే పరిమితం చేసింది. మరణంతో అన్నేళ్ల అవస్థ నుంచి వాడికి విముక్తి లభించిందనుకున్నాను. నా బాధల్లా ఒక్కటే. మా నాయిన పోయేనాటికి తమ్ముడికి మూడేళ్లు. ఈ చేతులతో ఎత్తుకొని, ఆడించి పెంచాను. వాడి ముందు నేను పోవాల్సింది. కానీ, వాడికి నేను చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వాడి జ్ఞాపకాలు నన్ను చుట్టుముడుతుంటాయి. మా ఇద్దరికి పన్నెండేళ్ల వయసు తేడా. ఇద్దరు చెల్లెళ్లు.
ఇంట్లో నేనే పెద్దవాడిని అవడంతో కుటుంబ భారం నా మీద పడింది. దరిద్రంలో భాగమవుతున్న కొద్దీ మా బాంధవ్యం కూడా బలపడుతూ వచ్చింది. నేను వేసుకున్న ప్యాంటును కత్తిరించి వాడు వేసుకునేవాడు. ఇంట్లో అందరూ సజ్జ గటక తిని, నా ఒక్కడికే సన్నబియ్యం అన్నం వండి వడ్డించేవారు. అప్పుడు తెలియలేదు. తర్వాత్తర్వాత నా తమ్ముడు, చెల్లెళ్లు నన్ను ఎంత గొప్పగా చూసుకున్నారోనని తెలుస్తూ వచ్చింది. వాడు మంచం పట్టేవరకు కూడా నేను ఫోన్ చేస్తే... కూర్చుని ఉన్న వాడు కాస్తా లేచి నిల్చొని మాట్లాడేవాడట. అక్కడున్నవాళ్లు ఆటపట్టించినా వినేవాడు కాదట... (దుఃఖంతో గొంతు పూడుకుపోయింది) అంత గౌరవం నేనంటే! తమాయించుకొని.. జీవి కణజాలానికి దేవునికి సంబంధం లేదు. కణాల ఆరోగ్యానికి మనం తీసుకునే ఆహారం, వంశపారంపర్యంగా వచ్చే జీన్స్ ఉపకరిస్తాయి. మరో బాధాకరమైన సంఘటన.. పదేళ్ల క్రితం నా భార్య తులసికోట దగ్గర దీపం వెలిగిస్తూ ఆ మంట అంటుకొని, కాలి చనిపోయింది. ఈ సంఘటనలకు ఎవరిన్నీ నిందించలేం. అది విధి, అంతే!
– నిర్మలారెడ్డి చిల్కమర్రి